……………………………………………
Dr రూపేష్ కుమార్ రెడ్డి
వయసు మీద పడే కొద్ది కట్టుకున్నోడు పుటుక్కు మన్నాడు…
కన్న కొడుకు వాడి పెళ్ళాం తో కలిసి కువైట్ లో తగలడ్డాడు..
కూతురుకి పెళ్ళి చేస్తే అదేమో అమ్మ నీ అల్లుడు గురించి తెలిసిందే కదా నేనెట్టా వచ్చేది అంటుంది నాయనా..
ఈ టైం లో పొద్దునే అలా ఒంటేలుకు పోదాం అని లేసి ఒక్క అడుగు ఏసా అంతే...రాత్రి వర్షానికి తడిసిన నేల కదా.. జర్రు మని జారింది..కింద పడిపోయా.. సచ్చిపాయ ప్రాణం అనుకున్నా…
అంతే లేవలేక పోయా నాయనా..ఊర్లో ఆటో ఓడికి ఫోన్ చేస్తే ..నీ దగ్గరకు తీసుకొచ్చి పడేసిపోయాడు..
నువ్వేమో చూసి అవ్వా కాలు విరిగింది ఆపరేషన్ చెయ్యాలి..రాడ్డు వెయ్యాలి ..ఆరోగ్యశ్రీ కార్డులు తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయావు..కువైట్ లో ఉండే కొడుకు కూతురికి ఫోన్ చేసి పొమ్మని చెప్పాడు.. వాడు ఏదో ఆ బిడ్డికి అంత చిల్లర పంపిస్తే ఇది చూస్కుంటా అని వచ్చింది..ఆ ఆపరేషన్ ఏదో బిన్నే చేసేసి పంపించే నన్ను..
సరే అవ్వ బీపీ కంట్రోల్ అయిన వెంటనే చేసేస్తాలే…రెండో రోజు ఇంకా బీపీ తగ్గలేదు అవ్వ ఆగాలి ఈరోజు కూడా అని చెప్పి అలా వచ్చా అంతే..
నాయనా.. చేసి పార దొబ్బు.. చస్తే చచ్చానులే …ఏముంది ఇంకా నేను చూసేదానికి.. చేసేదానికి.....నీ చేతిలో ప్రాణం పోతే పోనీలే సామి..నీకు పుణ్యం ఉంటుంది
మూడో రోజు అన్ని రెఢీ చేసి మత్తు ఇచ్చి ఫ్రాక్చర్ టేబుల్ మీద అవ్వని పనుకోబెట్టి ఇంక నేను వాష్ అయ్యి వచ్చి డ్రెస్ తగిలించుకొని గ్లోవ్స్ వేసుకొని అవ్వకేసి అలా చూసా..
కళ్ళలోనుంచి వస్తున్న కన్నీళ్లతో పలకరించింది...చెయ్యి పట్టుకుంది నువ్వే దేవుడు అని..మళ్ళీ గ్లోవ్స్ మార్చుకున్న.. సామి నడిచే లాగా చెయ్యి నన్ను..చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు బాగా బ్రతికిన కుటుంబం మాది...
ఇలా అంటుండగానే కత్తి చేతిలోకి తీసుకొని నా పని మొదలెట్టా.. మద్యలో అది ఇది మాట్లాడుతూ విరిగిన ఎముకను సెట్ చేసేసి ఇంక కుట్లు వెయ్యడానికి స్టూల్ వేసుకొని కూర్చున్నా
ఇంక మొదలెట్టా..ఏమవ్వ బాగా బ్రతికిన కుటుంభం అన్నావు..మళ్ళీ ఏమైంది అని....
కట్టుకున్నోడు…పుటుక్కుమన్నాడు. .కొడుకేమో పెళ్ళాంతో కువైట్ లో ఉన్నాడు .కూతురిని అడుగుదామని అంటే ..నీ అల్లుడు సంగతి తెలిసిందే కదా అని అంటుంది...చావు వచ్చినా బాగున్నే అని ఏదో అలా బ్రతుకుతున్నా నాయనా.. ఇంతలో ఇట్టా అయిపాయనే…అని బోరుమని ఏడుపు మొదలెట్టింది...ఇంతలో మెషిన్ సౌండ్ రావడంతో మా అనస్థీషియా డాక్టర్ వచ్చింది ..నన్ను తిట్టలేక..అవ్వా నువ్వు ఏమి ఆలోచించకు..నీ బీపీ మళ్ళీ పెరుగుతోంది అని...అంతలో కుట్లు కూడా వేసెయ్యడంతో అవ్వని వార్డ్ కి షిఫ్ట్ చేసా…
ఇంకా రెండో రోజు నుంచి ఒక్కటే గోల..ఎప్పుడు పంపుతారు అని..చేరాక ఎప్పుడు సర్జరీ చేస్తారు .అయ్యాక ఎప్పుడు ఇంటికి పంపుతారు..అందరిది ఇదే గోల...అలా ఐదో రోజు ఇంటికి పంపిన అవ్వని..తిరిగి లేసి నిలబెట్టే వరకు అవ్వతో ఉండే ఆ అనుభందం ఏ నన్ను ఈ ప్రాక్టీస్ చేసేలా చేస్తోంది..
ఎవరికి ఎవరు?? మీరే దేవుళ్ళు…
అన్న ఇలాంటి అవ్వ మాటలే విసిగించే పేషంట్లు చాలా మంది ఉన్నా..వాళ్ళతో మనకు ఏమి పని అని..అలా లాగిస్తున్నా ఈ హాస్పిటల్ నీ...ఈ వృత్తిని..
నా వయసు మీద పడితే నా పరిస్థితి ఏంటో…
మీ పరిస్ఠితి ఏంటో…
ఆలోచించండి…Roopesh Kumar Reddy A
………………………………
Dr రూపేష్ కుమార్ రెడ్డి
రిషి హాస్పిటల్
పీలేరు
సేకరణ : Social Media
No comments:
Post a Comment