01 నుండి 10 పద్యములు
చెమ్మ గిల్ల కనులె చేయుసా యమనుచు
ఆకలైన గూడ అడగ లేరు
అట్టి వైరి పైన ఆగ్రహం బొలదురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చెప్పి చెప్ప గానె చెడుమంచినెంచక
నమ్మి నంత నీకె నష్టమొచ్చు
మాట నమ్మ బోకు మాయాజ గమ్మున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
కోరి చేరి నట్టి కోమలి చెంతను
తనువు దెంపి నొసగు తల్లి ప్రేమ
వీడ బోకు యెపుడు విధులెన్ని యున్ననూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
తగిన ధనము యున్న తానునీ సొంతమై
ధనము లేని దినము దాటి నడయు
సఖియ కన్న జూడ సానియె మేలగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
ఒకరి తోటె మనసు నొకరి తోటె తనువు
వదల బోకు నీవు వారినెపుడు
తిరిగి రాదు రన్న తెగిన బంధమెపుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము
పాలు బోసి నంత పాముక రవదేమి
నీదు చెట్టు పళ్ళు నీవె యగున
సహజ గుణము లవియె సాధార ణములురా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
మాట లెన్నొ జెప్పి మనసును దోచేసి
పెళ్ళి యనగ ఒళ్ళు జల్లు మనుచు
తోక జార్చి తిరుగు తోడెళ్ళు యుండును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
తావు నివ్వ బోకు తగనివారి కెదన
దిశయె లేని ఓడ తీరు యగును
ఆత్మ పంచినోళ్ళు ఆశించ రేమియు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కలిగి వీడు గదర కష్టసు ఖమ్ములు
కష్టమొచ్చెననుచు కదలి పోకు
సుఖము లందు జనుల చులకన జేయకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
రంగు రంగు రాళ్ళు రాతను మార్చునా
చేతి గీత లెపుడు చెరగ వేమి
జాతకములె మనిషి జన్మను మార్చునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
11 నుండి 20 పద్యములు
తరము గాదు రన్న తనువును గాపాడ
బేర మాడ గలవ ప్రేమ విలువ
పౌరు షంబె వీడి పరమాత్మ మెరుగుము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
జన్మనిచ్చు వారె జననీ జనకులు నీ
ప్రాణ మిచ్చు విభుడె పరమ శివుడు
మనసు నిలుపు వాడె మహిమాన్వితుడుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
అరగనంత తిండి అంతులేని ధనము
సుఖముగోరి నడయు సులభమార్గ
మెపుడు కీడెజేయు మేలుకాదు వినుడీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
బతుక నేర్పు విద్య బడిలోన గలదేమి
జాలి కరుణ నేర్పు చదువు లేవి
పాఠ్య పుస్త కములె బాటతప్పెనుగద
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
మరల పొంద వచ్చు మణులుమా ణిక్యాలు
మంచి మనషి వీడ మరల రాడె
ధనము కొరకు జనుల దయయుంచి వీడకు
బ్రతుకమర్మమిదియె భ్రాంతి విడుము.
పుట్టి గిట్టె నడుమ బుడగవోలె బతుకు
అష్ట కష్ట ములతొ ఆస్తి బెంచి
అనుభ వించు లోపె ఆయువా గునుగదా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
కలము కాగితంబె కరమున యుండగ
నిజము రాయ లేని నీకు యెపుడు
పాత్రి కేయు డనెడి పాత్రత గదుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
అందమెంతయున్న అణకువ లేకున్న
ఆడ దాన్ని యెవరు ఆడదనరు
జలము లేని బావి జనులకేమిఫలము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
పాము తేళ్ళ తోటి పరిచయం బనినంత
కరచి కరచె జూపు కపట ప్రేమ
దుష్ట జనుల కెపుడు దూరమే తగునురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
ప్రేమ స్నేహ మనెడి వేలమన కనుచు
ఆశ పెరిగి జనులు ఆస్తి బెంచి
బంధ మొదిలి కాసు బంధీలు అవుదురు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
21 నుండి 30 పద్యములు
ధనమె దైవ మాయె ధరలోన జనులకు
ధనము లేదు యనిన దరికి రారె
కాయమున్న వరకె కాసువాం ఛలుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చదువు రాని వారె చట్టాలు జెప్తుంటె
చదువు నేర్చి నోళ్ళు చవట లైరి
చదువు విలువ పోయి జారెబ తుకుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చూడ వచ్చు రంట చుట్టాలు సుఖములో
కష్ట మొచ్చి నపుడు గాన రారె
కష్ట మందు కంట కన్నీరె తోడగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము
నీదు జ్ఞాన మెపుడు నివ్వుము పరులకు
సాయ మొసగు రన్న శ్రమను విడచి
తెలివి బంచ తొలగు తెరలుజీ వితమున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము,
ఎదుటి మనిషి బాధ నెరుగక పలికెడి
సూటి మాట లెపుడు సూది సమము
మాట భార మెరిగి మసలుట తగునురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
పుట్టి పుట్ట గానె మూర్ఖులు గారోయి
పెరుగు నపుడె మారు పెక్కు జనులు
మొగ్గలోనె దుంచు మోసగు ణంబుల
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
నిజము జెప్ప నీకు నిందాప నిందలే
కల్ల తోటె నడయు కలియు గమ్మె
నిజము పలుకు జనులు నిలుతురా గెలుతురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
అణిగి మణిగి యున్న అన్నివే ళలలోన
అణిచి వేయు జనులె యధిక ముండు
ఆత్మ గౌర వమ్మె ఆటబొమ్మాయెరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
హస్త రేఖ బట్టియాస్తులె వచ్చునా
పేరు మార్చ కీర్తి పెరగ దోయి
నమ్ము కొనగ నిన్నె నందని వుండునా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
నవ్వ బోకు పరుల నష్టంబులనుజూచి
పరుల సుఖము పైన పగను మాను
సమయ మెపుడు నీకె సహకరిం చదుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
31 నుండి 40 పద్యములు
చంప దలచి నంత చంపుము మనిషినె
యదను దెంచు కన్న యదియె మేలు
మనసు దుంచ దలచ మరణమే శరణమౌ
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము
ఇష్ట మొచ్చి నట్టు ఇంటయున్న దగును
నడత చెరుపు కోకు నలుగు రందు
బతుకు చెడిన తిరిగి వచ్చునా చచ్చినా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
గూఢ విషయ మెపుడు గుట్టుగే నుంచుము
నిన్ను దాట గుట్టు నిలుప దగున
గుట్టు రట్టు యయిన ఘోరంబె జరుగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చేతి కొచ్చె నంట చెరవాణి దెయ్యంబె
చదువు, సంధ్య మాని చచ్చె యువత
చేతి స్పర్శ దెంచి చేయు నొంటరినిను
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
చదువు జనులె మరిర చయితలె యుండరు
చదివె వాడ్ని గూడ చవట జేసి
పద్యమేల తెలుగు పలుకులే లందురే
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
నువ్వు మెచ్చి నట్టు నుండరు యందరు
నిన్ను నీవు యెరుగ నిజమె తెలియు
కారు యెవరు నీకు కానివా రనిసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కనులు తెరచి గాంచ కల్లయె లోకము
కనులు మూసి క్షణము గడుప దెలియు
చీక టందె యసలు జీవితమ్ముం డని
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము
మంచి మాట వినెడి మనుజులె కరువైరి
చెడువి నేరు జనులు చెవులు దెరచి
కనుల జూచి గూడ కల్లయం దురుగదా
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము.
ఆకలున్న వరకె ఆరగించి, మిగులు
దాని నిమ్ము యాక లన్న వార్కి
అర్థ మెరిగి ముద్ద వ్యర్థము జేయకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
తగిన జలము తోటి తనువు శుభ్రమగును
మంచి మాట వినిన మనసు విరయు
మంచి కీర్తి గలుగ మరణమె యుండునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
41 నుండి 50 పద్యములు
కష్ట బెట్ట కుండ కంటిరెప్పగబెంచు
తల్లి దండ్రి కనులు తడుపు నట్టి
సుతుడి కన్న జూడ శునకంబె మేలగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
పడతి ముదము జూసి పరవశమ్మును పొంది
సంబ రమ్ము తోన సతిగ గొనకు
అంద మొకటె గాదు మనసును గాంచరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
బండ్లు మేడలన్ని దండిగ పోగేసి
మనసు లోన దిగులు యనుట యేల
మూడు పూట్ల దొరకు ముద్దచా లుగదర
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
బాధ పంచుకొనిన భారమె తొలగును
నవ్వు పంచుకొనిన నలుగు రుందు
మనసు పంచబోకు మదిలేని జనులకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
తీతు వనెడి పిట్ట గీతమశుభమట
పిల్లి యెదురు వచ్చు విధమె తగదు
మంచిచెడ్డ లెపుడు మనలోనె యుండును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
దండు యెంత యున్న తల్లిపిల్ల నెరుగు
ఉన్న వాడ్నె జనులు చూతు రెపుడు
నరుడి మనసు నెపుడు నారాయ ణుడెరుగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
మెప్పు నొందు కొరకు నేపనీ జేయకు
మనసు బెట్టి చేయ మనుగ డుండు
గొప్ప కొరకు బోయి నొప్పుకో కెప్పుడూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కంచమందు కూడు కనులనిండనిదుర
కష్టబెట్టని సతి కలలు నింపు
ఇంతకన్న వేరె ఇఛ్ఛము లేలరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
అమ్మలేని దినము అన్నమే గిట్టదు
నాన్న లేని నాడు నాథు డెవడు
ధరణి దైవములను దయయుంచి పూజించు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
పోయు పోయి యేల పోరుపెట్టుకొనుట
పోరుకన్న వేరు పోటుగలద
మోటు మనసు తోటి మోడుబా రకుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
51 నుండి 60 పద్యములు
మంచి తాంబు లముతొ పండును నాలుక
ఇంతి మంచిదైన నిండు సుఖము
సజ్జనులతొ యున్న జన్మ ధన్యమగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
తప్పిదంబు జేసి తప్పించు కొనుకంటె
తప్పునొప్పుకొనుట తగిన గుణము
గుణము లేని వాడు గుండ్రాయి సమమురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
రాజకీయమనెది రాక్షస క్రీడరా
మంచి చేయ దక్కు మందలింపు
తప్పు జేసినోళ్ళె తారలై వెలుగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
మరణ మొచ్చు ననుచు మదిలోన దిగులేల
చేయదగిన మంచి చేయుమిపుడె
మరణమన్నదెపుడు మనసుకు కాదురా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
కొంచె కొంచె మైన గూర్చుము మంచిని
అంత కంత యౌను ఆత్మ శుధ్ధి
శుధ్ధి యైన ఆత్మ సుఖముల నొసగును
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
వాడి పొయిన పూలు వాసన నివ్వవు
మాడి పొయిన కూడు మట్టి పాలె
గాడి చెడిన వాడి మాటచె ల్లదెపుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
వృత్తి భత్యములతొ భుక్తిచా లదనుచు
లంచమడిగి నింపు కంచ మేల
అట్టి కూడు కన్న మట్టి మేలు గదరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
అంతు లేనివన్ని అర్థము లేనివా
అర్థమున్న వన్ని గాన గలవ
తెలిసి దెలియ కుండ దీర్పులు జెప్పకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము
పెద్దవారి మాట పెడచెవి న్బెట్టుచు
హితము జెప్పు జనుల హింస జూపి
మదము తోన యున్న మనుగడె యుండదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
బిచ్చ మడుగబోకు ప్రియురాలి ప్రేమను
కాసు కొరకు కాళ్ళు కడుగ బోకు
కాసు,కాంతలన్ని కాలమున్నవరకె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
61 నుండి 70 పద్యములు
దర్ప ణంబు వీడి దర్శనం గల్గునా
నిన్ను నీవు గాంచ నిదియె దారి
దైవదర్శనముకు ధ్యానమే మార్గము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
పచ్చ గడ్డి తినెడి పశువులై ననుకూడ
ఒక్క దెబ్బ తోటి వొదిగి యుండు
ఎన్ని దెబ్బలైన యెర్రోడు మారునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
ఎంత జేసి గూడ ఏమిజే స్తివనుచు
వాగుతున్నవాడి వాస మొదిలి
బిచ్చమెత్తి తిరుగ నిచ్చును సౌఖ్యము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కూడు తినెడి కాడ కులభేద మేలరా
మంచి మాట పలుక మతములేల
కులమతమ్ము వీడి గుణముల గాంచరా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
కామ కోరికగల కాంత యెల్లపుడును
కన్య యనుచు బలుకు కమ్మగాను
శాఖహారి ననెడి శార్దూల ముండునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఆశ పడుము గాని అత్యాశ వీడుము
మాయ జేయ బోకు మనసునెపుడు
నమ్మి చేరు జనుల నమ్మించి వీడకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
అవసరమ్ము నొకరు అటుపిమ్మట నొకరు
సాయమొందినీవు సాకు జెప్ప
అంత్యసమయ మందు నాదరించరెవరు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
మోస బోతి వనుచు మోడువై యుండకు
భాద పడకు మనసు భార మనుచు
మనసు విత్తు యొకటె మరలైన మొలయును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
ఏడిపించ బోకు ఎన్నడిల్లాలిని
ఇంతి కంట నీరు ఇంట కీడు
మనసు లేని పతిని మగవాడ నరుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
తల్లి దండ్రి మరియు తనసుఖంబుల వీడి
సగమె తాను యగును సతిగ నీలొ
కష్ట బెట్ట బోకు కాంతను యెప్పుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
71 నుండి 80 పద్యములు
ఆలి మనసు విరిచి ఆటలా డుకొనుచు
కామ కోరికలకె కాంత యనుచు
పలుకుతున్న నీకు పాడెగట్ట తగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
నుదుటి రాతలోనె నుండుజీ వితమని
చేత గాక యనకు చెత్త మాట
కష్ట పడిన దక్కు కలలసౌ ధంబులు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
వావి వరుసలొదిలి వాంఛలు చూపెడి
నీదు బతుకు కన్న నీఛ ముంద
పశువు మేలురన్న పరికించి చూడగా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
వంద మంది ఆప్త బంధువులందరూ
ఆస్తి యున్న వరకె అండ నుండు
ఆయు వయ్యి యుండు నాప్తమి త్రుడొకడె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కోప తాప మపుడు ఓర్పుగ నుండుము
తోడ నడచు వార్ని దోషులనకు
కలిసి జేయ పనుల కలుగును జయములు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చింతయేల నీకు చీకటి బతుకని
వెలుగు నింప గోరి వెదకి చూడ
దారి వేరె గలదె ధ్యానమా ర్గమొదలి
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఆకలన్న వాడి ఆకలి దీర్చుము
ప్రాణ మిచ్చు వాడి పక్క నిలుము
ఇంతకన్న పుణ్య మిలలోన దక్కునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
చెంత నున్న దెపుడు చేదుగే నుండును
అందరాని దెపుడు ఆశ పెంచు
ఆశ నదుపు జేయ ఆనంద మొసగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కాశి నందు విడువ కాయమె ధన్యము
మనసు బెట్ట దక్కు మంత్ర ఫలము
అహము వీడి నడువ అమరంబు దక్కును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
కఠిన విషము గూడ కలిగించదేహాని
మితము గొనిన గాని మిత్రు డైన
శత్రు వొక్కడున్న శరణమిం కెవరురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
81 నుండి 90 పద్యములు
తల్లి దండ్రి గురులు ధరలోన దైవాలు
సేవ జేసు కొనిన క్షేమ మగును
వీడి నడువ బోకు వీరిని యెన్నడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఓర్పు విడవ బోకు వోటమి యొదురైన
గెలుపు పిదప నెపుడు అలుపు వలదు
అన్ని వేళ లందు ఆశయంబు నిడకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఒక్కసారె జనన మొక్కసారెమరణ
మొక్క జీవి తంబె దక్కు నీకు
చక్క బెట్టు పూర్వ లెక్కలు అన్నియూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
మోము జూచి నమ్మ బోకుము జనులను
కన్ను లెపుడు జూపు కల్ల నిజము
మనసు బెట్టి జూడ మర్మంబు తెలియును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
మంద బుధ్ధి జనుల మందలించ వలదు
కూడ గట్టి చూడ కూరు పనులు
వానరములె గూడి వారథి గట్టెను
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
చేతులున్న వరకు చేయుచు సాయమ్ము
మాటయున్న వరకు మంచి బలుక
మరణ మంటు లేనమరులుగా యుందురు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఒక్క సారి బలుకు ఓంకార మంత్రము
బాహు భంద మనెడి భార మొదిలి
కలుగు మోక్ష ఫలము కలికాల మందున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
సంప దెంత యున్న సంతస మొందక
కూడ బెట్టు టేల గూడు వదిలి
రెప్ప పాటు బతుకు నెప్పుడు గనెదవు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
కానరాదు గనుక గాలిలే దనకుము
కాన రాని వన్ని కల్ల కాదు
గాంచ గలవ మదిని కారణ విభుడిని
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
నివురు తోటి నిప్పు నిర్మల మగురీతి
అంద మైన మగువ ఆశ బెంచు
తాకి చూడ బోకు తాటదీరునుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
91 నుండి 100 పద్యములు
పోయి మూర్ఖ జనుల పొత్తును గోరుట
తలచి జంట నడుమ తగువు దీర్చ
బీడు నేల లోన బీజంబు రీతగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
కటిక నేల మీద కన్నుల నిండుగ
ఒక్క కునుకు జాలు నొక్క క్షణము
ధనము తోనె సుఖము దక్కుట జరగదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
తెలుగు దెలిసి గూడ తెగ నీలిగెద వేల
ఆంగ్ల మందు మమ్మి యంటు నీవు
మాతృ భాష కన్న మధరమేది గలదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఆచరించలేని ఆశయా లన్నియు
ఆయు ధములు వీడి చేయు రణము
చీక టింట గీయు చిత్రంబు రీతగు
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.
నీతి లేని చోట నీడైన జొప్పకు
మాట గెలువ దనిన మాట నిడకు
మిన్న కుండి నన్న మిక్కిలి సౌఖ్యము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
కోపగించ దగదు కోమలి ప్రేమను
ఈసడింప దగదు హీన జనుల
ఎవరి మనసు నందు నేమేమి యుండునొ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
మనసు నుండి బలుకు మాటలు జాలును
చేత నైన దనిన చేసి చూపు
చివరి వరకు నిలుచు చేసిన సాయమె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
ధనము గూడబెట్టి దానంబు జేయక
విద్య నేర్చి గూడ విలువ మరచి
కాటి కాపరి వలె కాలమీ డ్చదగదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
నాది నీది యన్న వాదమ్ము లేలరా
పుట్టినప్పుడేమి పట్టు కొస్తి
వీవు చావు లోన వెంటనే దినిలుచు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.
ఆడి తప్పబోకు యప్పులు జేయకు
తప్పిదంబుచేసి తప్పు కోకు
దాన ధర్మ దయను దాటను బోకుము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము
Pages:
1 2 3 4 5 6 7 8 9 10రచన : వంశీకృష్ణ కాసులనాటి