Pages

శతకము

👉For Web view👈



- 1 -

చెమ్మ గిల్ల కనులె చేయుసా యమనుచు
ఆకలైన గూడ అడగ లేరు
అట్టి వైరి పైన ఆగ్రహం బొలదురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చెప్పి చెప్ప గానె చెడుమంచినెంచక
నమ్మి నంత నీకె నష్టమొచ్చు
మాట నమ్మ బోకు మాయాజ గమ్మున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

కోరి చేరి నట్టి కోమలి చెంతను
తనువు దెంపి నొసగు తల్లి ప్రేమ
వీడ బోకు యెపుడు విధులెన్ని యున్ననూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

తగిన ధనము యున్న తానునీ సొంతమై
ధనము లేని దినము దాటి నడయు
సఖియ కన్న జూడ సానియె మేలగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 2 -

ఒకరి తోటె మనసు నొకరి తోటె తనువు
వదల బోకు నీవు వారినెపుడు
తిరిగి రాదు రన్న తెగిన బంధమెపుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

పాలు బోసి నంత పాముక రవదేమి
నీదు చెట్టు పళ్ళు నీవె యగున
సహజ గుణము లవియె సాధార ణములురా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

మాట లెన్నొ జెప్పి మనసును దోచేసి
పెళ్ళి యనగ ఒళ్ళు జల్లు మనుచు
తోక జార్చి తిరుగు తోడెళ్ళు యుండును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

తావు నివ్వ బోకు తగనివారి కెదన
దిశయె లేని ఓడ తీరు యగును
ఆత్మ పంచినోళ్ళు ఆశించ రేమియు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 3 -

కలిగి వీడు గదర కష్టసు ఖమ్ములు
కష్టమొచ్చెననుచు కదలి పోకు
సుఖము లందు జనుల చులకన జేయకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

రంగు రంగు రాళ్ళు రాతను మార్చునా
చేతి గీత లెపుడు చెరగ వేమి
జాతకములె మనిషి జన్మను మార్చునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

తరము గాదు రన్న తనువును గాపాడ
బేర మాడ గలవ ప్రేమ విలువ
పౌరు షంబె వీడి పరమాత్మ మెరుగుము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

జన్మనిచ్చు వారె జననీ జనకులు నీ
ప్రాణ మిచ్చు విభుడె పరమ శివుడు
మనసు నిలుపు వాడె మహిమాన్వితుడుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 4 -

అరగనంత తిండి అంతులేని ధనము
సుఖముగోరి నడయు సులభమార్గ
మెపుడు కీడెజేయు మేలుకాదు వినుడీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

బతుక నేర్పు విద్య బడిలోన గలదేమి
జాలి కరుణ నేర్పు చదువు లేవి
పాఠ్య పుస్త కములె బాటతప్పెనుగద
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

మరల పొంద వచ్చు మణులుమా ణిక్యాలు
మంచి మనషి వీడ మరల రాడె
ధనము కొరకు జనుల దయయుంచి వీడకు
బ్రతుకమర్మమిదియె భ్రాంతి విడుము.

పుట్టి గిట్టె నడుమ బుడగవోలె బతుకు
అష్ట కష్ట ములతొ ఆస్తి బెంచి
అనుభ వించు లోపె ఆయువా గునుగదా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 5 -

కలము కాగితంబె కరమున యుండగ
నిజము రాయ లేని నీకు యెపుడు
పాత్రి కేయు డనెడి పాత్రత గదుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

అందమెంతయున్న అణకువ లేకున్న
ఆడ దాన్ని యెవరు ఆడదనరు
జలము లేని బావి జనులకేమిఫలము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

పాము తేళ్ళ తోటి పరిచయం బనినంత
కరచి కరచె జూపు కపట ప్రేమ
దుష్ట జనుల కెపుడు దూరమే తగునురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

ప్రేమ స్నేహ మనెడి వేలమన కనుచు
ఆశ పెరిగి జనులు ఆస్తి బెంచి
బంధ మొదిలి కాసు బంధీలు అవుదురు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 6 -

ధనమె దైవ మాయె ధరలోన జనులకు
ధనము లేదు యనిన దరికి రారె
కాయమున్న వరకె కాసువాం ఛలుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చదువు రాని వారె చట్టాలు జెప్తుంటె
చదువు నేర్చి నోళ్ళు చవట లైరి
చదువు విలువ పోయి జారెబ తుకుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చూడ వచ్చు రంట చుట్టాలు సుఖములో
కష్ట మొచ్చి నపుడు గాన రారె
కష్ట మందు కంట కన్నీరె తోడగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

నీదు జ్ఞాన మెపుడు నివ్వుము పరులకు
సాయ మొసగు రన్న శ్రమను విడచి
తెలివి బంచ తొలగు తెరలుజీ వితమున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 7 -

ఎదుటి మనిషి బాధ నెరుగక పలికెడి
సూటి మాట లెపుడు సూది సమము
మాట భార మెరిగి మసలుట తగునురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

పుట్టి పుట్ట గానె మూర్ఖులు గారోయి
పెరుగు నపుడె మారు పెక్కు జనులు
మొగ్గలోనె దుంచు మోసగు ణంబుల
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

నిజము జెప్ప నీకు నిందాప నిందలే
కల్ల తోటె నడయు కలియు గమ్మె
నిజము పలుకు జనులు నిలుతురా గెలుతురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

అణిగి మణిగి యున్న అన్నివే ళలలోన
అణిచి వేయు జనులె యధిక ముండు
ఆత్మ గౌర వమ్మె ఆటబొమ్మాయెరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 8 -

హస్త రేఖ బట్టియాస్తులె వచ్చునా
పేరు మార్చ కీర్తి పెరగ దోయి
నమ్ము కొనగ నిన్నె నందని వుండునా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

నవ్వ బోకు పరుల నష్టంబులనుజూచి
పరుల సుఖము పైన పగను మాను
సమయ మెపుడు నీకె సహకరిం చదుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చంప దలచి నంత చంపుము మనిషినె
యదను దెంచు కన్న యదియె మేలు
మనసు దుంచ దలచ మరణమే శరణమౌ
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము

ఇష్ట మొచ్చి నట్టు ఇంటయున్న దగును
నడత చెరుపు కోకు నలుగు రందు
బతుకు చెడిన తిరిగి వచ్చునా చచ్చినా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 9 -

గూఢ విషయ మెపుడు గుట్టుగే నుంచుము
నిన్ను దాట గుట్టు నిలుప దగున
గుట్టు రట్టు యయిన ఘోరంబె జరుగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చేతి కొచ్చె నంట చెరవాణి దెయ్యంబె
చదువు, సంధ్య మాని చచ్చె యువత
చేతి స్పర్శ దెంచి చేయు నొంటరినిను
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

చదువు జనులె మరిర చయితలె యుండరు
చదివె వాడ్ని గూడ చవట జేసి
పద్యమేల తెలుగు పలుకులే లందురే
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

నువ్వు మెచ్చి నట్టు నుండరు యందరు
నిన్ను నీవు యెరుగ నిజమె తెలియు
కారు యెవరు నీకు కానివా రనిసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 10 -

కనులు తెరచి గాంచ కల్లయె లోకము
కనులు మూసి క్షణము గడుప దెలియు
చీక టందె యసలు జీవితమ్ముం డని
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

మంచి మాట వినెడి మనుజులె కరువైరి
చెడువి నేరు జనులు చెవులు దెరచి
కనుల జూచి గూడ కల్లయం దురుగదా
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము.

ఆకలున్న వరకె ఆరగించి, మిగులు
దాని నిమ్ము యాక లన్న వార్కి
అర్థ మెరిగి ముద్ద వ్యర్థము జేయకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

తగిన జలము తోటి తనువు శుభ్రమగును
మంచి మాట వినిన మనసు విరయు
మంచి కీర్తి గలుగ మరణమె యుండునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 11 -

కష్ట బెట్ట కుండ కంటిరెప్పగబెంచు
తల్లి దండ్రి కనులు తడుపు నట్టి
సుతుడి కన్న జూడ శునకంబె మేలగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

పడతి ముదము జూసి పరవశమ్మును పొంది
సంబ రమ్ము తోన సతిగ గొనకు
అంద మొకటె గాదు మనసును గాంచరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

బండ్లు మేడలన్ని దండిగ పోగేసి
మనసు లోన దిగులు యనుట యేల
మూడు పూట్ల దొరకు ముద్దచా లుగదర
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

నవ్వి నడువ వలయు నరకమైనను గూడ
కాంతు లీడి ముదము కళను బెంచు
ముఖము కళగ యున్న సుఖములన్నిగలుగు
బ్రతుక మర్మ మిదియె భ్రాంతివిడుము


- 12 -

తీతు వనెడి పిట్ట గీతమశుభమట
పిల్లి యెదురు వచ్చు విధమె తగదు
మంచిచెడ్డ లెపుడు మనలోనె యుండును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

దండు యెంత యున్న తల్లిపిల్ల నెరుగు
ఉన్న వాడ్నె జనులు చూతు రెపుడు
నరుడి మనసు నెపుడు నారాయ ణుడెరుగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

మెప్పు నొందు కొరకు నేపనీ జేయకు
మనసు బెట్టి చేయ మనుగ డుండు
గొప్ప కొరకు బోయి నొప్పుకో కెప్పుడూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

కంచమందు కూడు కనులనిండనిదుర
కష్టబెట్టని సతి కలలు నింపు
ఇంతకన్న వేరె ఇఛ్ఛము లేలరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 13 -

అమ్మలేని దినము అన్నమే గిట్టదు
నాన్న లేని నాడు నాథు డెవడు
ధరణి దైవములను దయయుంచి పూజించు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

పోయు పోయి యేల పోరుపెట్టుకొనుట
పోరుకన్న వేరు పోటుగలద
మోటు మనసు తోటి మోడుబా రకుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

మంచి తాంబు లముతొ పండును నాలుక
ఇంతి మంచిదైన నిండు సుఖము
సజ్జనులతొ యున్న జన్మ ధన్యమగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

తప్పిదంబు జేసి తప్పించు కొనుకంటె
తప్పునొప్పుకొనుట తగిన గుణము
గుణము లేని వాడు గుండ్రాయి సమమురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 14 -

రాజకీయమనెది రాక్షస క్రీడరా
మంచి చేయ దక్కు మందలింపు
తప్పు జేసినోళ్ళె తారలై వెలుగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

మరణ మొచ్చు ననుచు మదిలోన దిగులేల
చేయదగిన మంచి చేయుమిపుడె
మరణమన్నదెపుడు మనసుకు కాదురా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

కొంచె కొంచె మైన గూర్చుము మంచిని
అంత కంత యౌను ఆత్మ శుధ్ధి
శుధ్ధి యైన ఆత్మ సుఖముల నొసగును
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

వాడి పొయిన పూలు వాసన నివ్వవు
మాడి పొయిన కూడు మట్టి పాలె
గాడి చెడిన వాడి మాటచె ల్లదెపుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 15 -

వృత్తి భత్యములతొ భుక్తిచా లదనుచు
లంచమడిగి నింపు కంచ మేల
అట్టి కూడు కన్న మట్టి మేలు గదరా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

అంతు లేనివన్ని అర్థము లేనివా
అర్థమున్న వన్ని గాన గలవ
తెలిసి దెలియ కుండ దీర్పులు జెప్పకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

పెద్దవారి మాట పెడచెవి న్బెట్టుచు
హితము జెప్పు జనుల హింస జూపి
మదము తోన యున్న మనుగడె యుండదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

బిచ్చ మడుగబోకు ప్రియురాలి ప్రేమను
కాసు కొరకు కాళ్ళు కడుగ బోకు
కాసు,కాంతలన్ని కాలమున్నవరకె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 16 -

దర్ప ణంబు వీడి దర్శనం గల్గునా
నిన్ను నీవు గాంచ నిదియె దారి
దైవదర్శనముకు ధ్యానమే మార్గము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

పచ్చ గడ్డి తినెడి పశువులై ననుకూడ
ఒక్క దెబ్బ తోటి వొదిగి యుండు
ఎన్ని దెబ్బలైన యెర్రోడు మారునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

ఎంత జేసి గూడ ఏమిజే స్తివనుచు
వాగుతున్నవాడి వాస మొదిలి
బిచ్చమెత్తి తిరుగ నిచ్చును సౌఖ్యము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

కూడు తినెడి కాడ కులభేద మేలరా
మంచి మాట పలుక మతములేల
కులమతమ్ము వీడి గుణముల గాంచరా
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.


- 17 -

కామ కోరికగల కాంత యెల్లపుడును
కన్య యనుచు బలుకు కమ్మగాను
శాఖహారి ననెడి శార్దూల ముండునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఆశ పడుము గాని అత్యాశ వీడుము
మాయ జేయ బోకు మనసునెపుడు
నమ్మి చేరు జనుల నమ్మించి వీడకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

అవసరమ్ము నొకరు అటుపిమ్మట నొకరు
సాయమొందినీవు సాకు జెప్ప
అంత్యసమయ మందు నాదరించరెవరు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

మోస బోతి వనుచు మోడువై యుండకు
భాద పడకు మనసు భార మనుచు
మనసు విత్తు యొకటె మరలైన మొలయును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 18 -

ఏడిపించ బోకు ఎన్నడిల్లాలిని
ఇంతి కంట నీరు ఇంట కీడు
మనసు లేని పతిని మగవాడ నరుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

తల్లి దండ్రి మరియు తనసుఖంబుల వీడి
సగమె తాను యగును సతిగ నీలొ
కష్ట బెట్ట బోకు కాంతను యెప్పుడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఆలి మనసు విరిచి ఆటలా డుకొనుచు
కామ కోరికలకె కాంత యనుచు
పలుకుతున్న నీకు పాడెగట్ట తగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

నుదుటి రాతలోనె నుండుజీ వితమని
చేత గాక యనకు చెత్త మాట
కష్ట పడిన దక్కు కలలసౌ ధంబులు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 19 -

వావి వరుసలొదిలి వాంఛలు చూపెడి
నీదు బతుకు కన్న నీఛ ముంద
పశువు మేలురన్న పరికించి చూడగా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

వంద మంది ఆప్త బంధువులందరూ
ఆస్తి యున్న వరకె అండ నుండు
ఆయు వయ్యి యుండు నాప్తమి త్రుడొకడె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

కోప తాప మపుడు ఓర్పుగ నుండుము
తోడ నడచు వార్ని దోషులనకు
కలిసి జేయ పనుల కలుగును జయములు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చింతయేల నీకు చీకటి బతుకని
వెలుగు నింప గోరి వెదకి చూడ
దారి వేరె గలదె ధ్యానమా ర్గమొదలి
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 20 -

ఆకలన్న వాడి ఆకలి దీర్చుము
ప్రాణ మిచ్చు వాడి పక్క నిలుము
ఇంతకన్న పుణ్య మిలలోన దక్కునా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

చెంత నున్న దెపుడు చేదుగే నుండును
అందరాని దెపుడు ఆశ పెంచు
ఆశ నదుపు జేయ ఆనంద మొసగును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

కాశి నందు విడువ కాయమె ధన్యము
మనసు బెట్ట దక్కు మంత్ర ఫలము
అహము వీడి నడువ అమరంబు దక్కును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

కఠిన విషము గూడ కలిగించదేహాని
మితము గొనిన గాని మిత్రు డైన
శత్రు వొక్కడున్న శరణమిం కెవరురా
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 21 -

తల్లి దండ్రి గురులు ధరలోన దైవాలు
సేవ జేసు కొనిన క్షేమ మగును
వీడి నడువ బోకు వీరిని యెన్నడు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఓర్పు విడవ బోకు వోటమి యొదురైన
గెలుపు పిదప నెపుడు అలుపు వలదు
అన్ని వేళ లందు ఆశయంబు నిడకు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఒక్కసారె జనన మొక్కసారెమరణ
మొక్క జీవి తంబె దక్కు నీకు
చక్క బెట్టు పూర్వ లెక్కలు అన్నియూ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

మోము జూచి నమ్మ బోకుము జనులను
కన్ను లెపుడు జూపు కల్ల నిజము
మనసు బెట్టి జూడ మర్మంబు తెలియును
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 22 -

మంద బుధ్ధి జనుల మందలించ వలదు
కూడ గట్టి చూడ కూరు పనులు
వానరములె గూడి వారథి గట్టెను
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

చేతులున్న వరకు చేయుచు సాయమ్ము
మాటయున్న వరకు మంచి బలుక
మరణ మంటు లేనమరులుగా యుందురు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఒక్క సారి బలుకు ఓంకార మంత్రము
బాహు భంద మనెడి భార మొదిలి
కలుగు మోక్ష ఫలము కలికాల మందున
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

సంప దెంత యున్న సంతస మొందక
కూడ బెట్టు టేల గూడు వదిలి
రెప్ప పాటు బతుకు నెప్పుడు గనెదవు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 23 -

కానరాదు గనుక గాలిలే దనకుము
కాన రాని వన్ని కల్ల కాదు
గాంచ గలవ మదిని కారణ విభుడిని
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

నివురు తోటి నిప్పు నిర్మల మగురీతి
అంద మైన మగువ ఆశ బెంచు
తాకి చూడ బోకు తాటదీరునుసుమీ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

పోయి మూర్ఖ జనుల పొత్తును గోరుట
తలచి జంట నడుమ తగువు దీర్చ
బీడు నేల లోన బీజంబు రీతగు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

కటిక నేల మీద కన్నుల నిండుగ
ఒక్క కునుకు జాలు నొక్క క్షణము
ధనము తోనె సుఖము దక్కుట జరగదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 24 -

తెలుగు దెలిసి గూడ తెగ నీలిగెద వేల
ఆంగ్ల మందు మమ్మి యంటు నీవు
మాతృ భాష కన్న మధరమేది గలదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఆచరించలేని ఆశయా లన్నియు
ఆయు ధములు వీడి చేయు రణము
చీక టింట గీయు చిత్రంబు రీతగు
బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

నీతి లేని చోట నీడైన జొప్పకు
మాట గెలువ దనిన మాట నిడకు
మిన్న కుండి నన్న మిక్కిలి సౌఖ్యము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

కోపగించ దగదు కోమలి ప్రేమను
ఈసడింప దగదు హీన జనుల
ఎవరి మనసు నందు నేమేమి యుండునొ
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.


- 25 -

మనసు నుండి బలుకు మాటలు జాలును
చేత నైన దనిన చేసి చూపు
చివరి వరకు నిలుచు చేసిన సాయమె
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

ధనము గూడబెట్టి దానంబు జేయక
విద్య నేర్చి గూడ విలువ మరచి
కాటి కాపరి వలె కాలమీ డ్చదగదు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

నాది నీది యన్న వాదమ్ము లేలరా
పుట్టినప్పుడేమి పట్టు కొస్తి
వీవు చావు లోన వెంటనే దినిలుచు
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

ఆడి తప్పబోకు యప్పులు జేయకు
తప్పిదంబుచేసి తప్పు కోకు
దాన ధర్మ దయను దాటను బోకుము
బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము


- 26 -






ధన్యవాదాలు

(NOTE: click the right/left pages to move next/previous pages)

పగ

ఓ వ్యక్తి ఓ మహర్షి దగ్గరకు వెళ్ళి స్వామి నాకు ద్రోహం తలచిన వారి మీద నన్ను మోసం చేసినవారిమీద నాపైన నిందమోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తున్నది నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు. ఒక సంచిని అతడి చేతిలో పెట్టి దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి ఈ సంచిలో వేసుకో ఒక ఆలుగడ్డ పై ఒక్కరి పేరు మాత్రమే రాయాలి నువ్వు ఎక్కడకు వెళ్లినా ఈ సంచిని మాత్రం మరిచిపోకూడదు నీ వెంటే తీసుకువెళ్లాలి అన్నారు.ఇంత సులువా ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయల్దేరాడు. అతడికి ఎవరిపైన అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలు గడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు.మొదట్లో అది ఇబ్బందిగా అనిపించలేదు. ఆ తరువాత బరువు పెరిగింది. ఆలు కుళ్లిపోవడం మొదలయింది. భరించలేని కంపు వస్తున్నది. ఇప్పుడు ఇతని దగ్గరకు రావడానికి అందరూ స్నేహితులు బంధువులు భార్య పిల్లలు అందరూ.ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామిజీ దగ్గరకు వెళ్ళాడు.ఏంటి స్వామిజీ ఇలా చేసారు ఎవరూ నాదగ్గరకు కూడా రావడంలేదు నన్ను పగసాధించవద్దని చెప్పించడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు. అంటే నన్ను బాధ పెట్టినవారిని వదిలేయమని వారి పాపంలో వారు పోతారనేగా అన్నాడు.మహర్షి "కాదు నువ్వు వదిలేయడంకన్నా నీ మనసు నుండి తీసేయమని చెబుతున్నాను. చెడిపోయాయని ఆలూని పడేసావు.ఆ సంచినే పడేసుండాలని నేనుఅంటున్నాను.ప్రశాంతమైన మనసును నువ్వు కలిగిఉండాలని అంటున్నాను.నిన్ను బాధ పెట్టినవారు ఖచ్చితంగా అనుభవిస్తారు. దాన్ని తలచి నువ్వెందుకు బాధ పడడం.*నువ్వు నీ పనిపైన మనసును లగ్నం చెయ్యి. సంతోషంగా ఉండు. ఏది మరిచిపోవాలో అది గుర్తుపెట్టుకుని బాధ పడడం ఎందుకు. ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మరిచిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పారు ..* ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు నందనవనమే.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 To see more posts click👇
తెలుగులో విజ్ఞానం
Share on WhatsApp
సేకరణ : Social Media

సంపద

💰💰 #సంపద 💰💰
~~~~~~~~~~~~~~~~~

💐 ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. 
‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు.

💐 ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.

💐 ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు.
గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 

💐 ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.

 💐 మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు. ‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. 
నిజాయతీగా సంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

గురుర్బ్రహ్మ - 2

అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు...
‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘
ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు... ‘సర్, నేను మీ స్టూడెంట్‌ను...’
‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’
‘నేను టీచర్ అయ్యాను మాస్టారూ...’
‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’
‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’
‘అదేంటి..?’
‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి...’
------
‘‘ఓసారి నా దోస్త్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు... దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి దొంగతనం చేశాను... కాసేపటికి వాడికి వాచీ పోయిందని తెలిసొచ్చింది... లబోదిబో ఏడ్చాడు... టీచర్‌కు కంప్లయింట్ చేశాడు... అప్పుడు ఆ టీచర్ మీరే...
ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు... నేనేమీ భయపడలేదు, తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా... 
మీరు కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్‌గా నిలబెట్టారు... ప్రతి ఒక్కరి జేబూ చెక్ చేస్తానన్నారు... కాకపోతే అందరినీ కళ్లుమూసుకోవాలని చెప్పారు... జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా అన్నారు...
తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు... నాకు అర్థం కాలేదు...
వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు అన్ని జేబుల తనిఖీ అయిపోయాక... 
ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా డిగ్నిటీని మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో... 
నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్... కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా... నాఅంతట నేనే మారిపోయేలా చేశారు... ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...’’
.
.
.
.
అప్పుడు ఆ టీచర్ చెప్పాడు... ‘‘ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు కారణం కావొచ్చు... అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...’’
.
.
.
.
హేపీ టీచర్స డే... (ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు ఎప్పటిలాగే నా స్వేచ్చానువాదం...)
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

గురుర్బ్రహ్మ

ఈరోజు *గురుపూజోత్సవం* సంధర్భంగా చక్కని *కథ*
 *గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం*
🙏🙏🙏🙏🙏🙏
*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*
*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*
*******************
అయితే... 
ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.⚘
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు *"ప్రారబ్ధం భోగతో నస్యేత్"* అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

*0*0*0*0*0*0*

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ  అంకితం....
----------------- 

*సర్వే జనా సుఖినో భవంతు...*
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ఎవరికి ఎవరు?? మీరే దేవుళ్ళు…

ఎవరికి ఎవరు?? మీరే దేవుళ్ళు…
……………………………………………
Dr రూపేష్‌ కుమార్‌ రెడ్డి

వయసు మీద పడే కొద్ది కట్టుకున్నోడు పుటుక్కు మన్నాడు…

కన్న కొడుకు వాడి పెళ్ళాం తో కలిసి కువైట్ లో తగలడ్డాడు..

కూతురుకి పెళ్ళి చేస్తే అదేమో అమ్మ నీ అల్లుడు గురించి తెలిసిందే కదా నేనెట్టా వచ్చేది అంటుంది నాయనా..

ఈ టైం లో పొద్దునే అలా ఒంటేలుకు పోదాం అని లేసి ఒక్క అడుగు ఏసా అంతే...రాత్రి వర్షానికి తడిసిన నేల కదా.. జర్రు మని జారింది..కింద పడిపోయా.. సచ్చిపాయ ప్రాణం అనుకున్నా…

అంతే లేవలేక పోయా నాయనా..ఊర్లో ఆటో ఓడికి ఫోన్ చేస్తే ..నీ దగ్గరకు తీసుకొచ్చి పడేసిపోయాడు..

నువ్వేమో చూసి అవ్వా కాలు విరిగింది ఆపరేషన్ చెయ్యాలి..రాడ్డు వెయ్యాలి ..ఆరోగ్యశ్రీ కార్డులు తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయావు..కువైట్ లో ఉండే కొడుకు కూతురికి ఫోన్ చేసి పొమ్మని చెప్పాడు.. వాడు ఏదో ఆ బిడ్డికి అంత చిల్లర పంపిస్తే ఇది చూస్కుంటా అని వచ్చింది..ఆ ఆపరేషన్ ఏదో బిన్నే చేసేసి పంపించే నన్ను..

సరే అవ్వ బీపీ కంట్రోల్ అయిన వెంటనే చేసేస్తాలే…రెండో రోజు ఇంకా బీపీ తగ్గలేదు అవ్వ ఆగాలి ఈరోజు కూడా అని చెప్పి అలా వచ్చా అంతే..

నాయనా.. చేసి పార దొబ్బు.. చస్తే చచ్చానులే …ఏముంది ఇంకా నేను చూసేదానికి.. చేసేదానికి.....నీ చేతిలో ప్రాణం పోతే పోనీలే సామి..నీకు పుణ్యం ఉంటుంది

మూడో రోజు అన్ని రెఢీ చేసి మత్తు ఇచ్చి ఫ్రాక్చర్ టేబుల్ మీద అవ్వని పనుకోబెట్టి ఇంక నేను వాష్ అయ్యి వచ్చి డ్రెస్ తగిలించుకొని గ్లోవ్స్ వేసుకొని అవ్వకేసి అలా చూసా..
కళ్ళలోనుంచి వస్తున్న కన్నీళ్లతో పలకరించింది...చెయ్యి పట్టుకుంది నువ్వే దేవుడు అని..మళ్ళీ గ్లోవ్స్ మార్చుకున్న.. సామి నడిచే లాగా చెయ్యి నన్ను..చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు బాగా బ్రతికిన కుటుంబం మాది...

ఇలా అంటుండగానే కత్తి చేతిలోకి తీసుకొని నా పని మొదలెట్టా.. మద్యలో అది ఇది మాట్లాడుతూ విరిగిన ఎముకను సెట్ చేసేసి ఇంక కుట్లు వెయ్యడానికి స్టూల్ వేసుకొని కూర్చున్నా

ఇంక మొదలెట్టా..ఏమవ్వ బాగా బ్రతికిన కుటుంభం అన్నావు..మళ్ళీ ఏమైంది అని....

కట్టుకున్నోడు…పుటుక్కుమన్నాడు. .కొడుకేమో పెళ్ళాంతో కువైట్ లో ఉన్నాడు .కూతురిని అడుగుదామని అంటే ..నీ అల్లుడు సంగతి తెలిసిందే కదా అని అంటుంది...చావు వచ్చినా బాగున్నే అని ఏదో అలా బ్రతుకుతున్నా నాయనా.. ఇంతలో ఇట్టా అయిపాయనే…అని బోరుమని ఏడుపు మొదలెట్టింది...ఇంతలో మెషిన్‌ సౌండ్ రావడంతో మా అనస్థీషియా డాక్టర్ వచ్చింది ..నన్ను తిట్టలేక..అవ్వా నువ్వు ఏమి ఆలోచించకు..నీ బీపీ మళ్ళీ పెరుగుతోంది అని...అంతలో కుట్లు కూడా వేసెయ్యడంతో అవ్వని వార్డ్ కి షిఫ్ట్ చేసా…

ఇంకా రెండో రోజు నుంచి ఒక్కటే గోల..ఎప్పుడు పంపుతారు అని..చేరాక ఎప్పుడు సర్జరీ చేస్తారు .అయ్యాక ఎప్పుడు ఇంటికి పంపుతారు..అందరిది ఇదే గోల...అలా ఐదో రోజు ఇంటికి పంపిన అవ్వని..తిరిగి లేసి నిలబెట్టే వరకు అవ్వతో ఉండే ఆ అనుభందం ఏ నన్ను ఈ ప్రాక్టీస్ చేసేలా చేస్తోంది..

ఎవరికి ఎవరు?? మీరే దేవుళ్ళు…

అన్న ఇలాంటి అవ్వ మాటలే విసిగించే పేషంట్లు చాలా మంది ఉన్నా..వాళ్ళతో మనకు ఏమి పని అని..అలా లాగిస్తున్నా ఈ హాస్పిటల్ నీ...ఈ వృత్తిని..

నా వయసు మీద పడితే నా పరిస్థితి ఏంటో…

మీ పరిస్ఠితి ఏంటో…

ఆలోచించండి…Roopesh Kumar Reddy A
………………………………
Dr రూపేష్‌ కుమార్‌ రెడ్డి
రిషి హాస్పిటల్‌
పీలేరు
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media