Pages

కవితలు



మా పిత్రుదేవుడి మేథస్సుకు
ఉప్పొంగి పోతుంది ఆ ఛందస్సు
సంధులు సమాసాలతో మనల్ని
స్వర్గలోక గొందుల్లో తిప్పించగలడు
అనితర సాధ్యమైన పదాలనుపయోగించి
అత్యద్భుతంగా పద్యాలు రాయగలడు
తెలుగు భాషలో కవిత్వానికి తనకుతానే ఒక కర్త
తెలుగు తల్లి దేవాలయానికి అతనే ధర్మకర్త
నాతండ్రి మేథో సంపత్తికి
నేనిచ్చే ఈచిన్ని కవితా హారతి.
_______________________________________


సవర్ణదీర్ఘసంధికి సువర్ణపుకవచం తొడిగి
గుణసంధిగణాలకు గుణాలను పెంచి
సర్వ సంధులతో సంధి చేసుకొని
సకల సమాసాలతో వాసాలునిర్మించి
తెలుగు ఛందస్సుకోటను పటిష్ఠపరచి,
అజరామజర పద్యాలకు పాలకుడై
అనితరసాధ్య రచనలకు పోషకుడై
అవిశ్రాంత తెలుగు సాహిత్య శోధకుడై
విశ్రాంత తెలుగు పాఠ్య బోధకుడై
తెలుగు కవితారథ చోదకుడైన మీకు,
ఏకలవ్య శిష్యుడనై, మీ తనయుడనై
అనేకానేక సుమధుర కుసుమసుమాంజలులతో
పవిత్రపిత్రు పాదసేవకై సాష్టాంగప్రణామాలిడుతూ...

_________________________________________

"క" లంనుండి జారిన అక్షరాలు, మనసుని
"వి" హంగ వీక్షణం చేయిస్తూ,తనువుని
"త" న్మయత్నానికి గురిచేసేదే
కవిత.
---------------------------------------
అక్షరాల్లా "క"నిపిస్తూ
భావాన్ని  "వి"నిపిస్తూ
మనసును"త"డిపేసేదే
           *కవిత*.
---------------------------------------
నా ఆలోచనలకు ఆకలి పెంచుతూ
నా అక్షరాలకు ఆవేశాన్ని నింపుతూ
నా కలలకు చీకటి నిమురుతూ
నా వెలుగులకు నీడను అద్దుతూ
ఇంకెన్నాళ్ళీ ఎడబాటు
తీసుకెళ్ళు  నీతోబాటు.
_______________________________

ఊపిరి పీల్చుకోవటం
గుండె ఆడుతూ వుండటం
నువ్వు ఎదురుగా వున్నప్పడు నిన్ను చూస్తూవుండటం
వీటిల్లో ఏది ఆగినా నా ప్రాణం పోయినట్టే.
____________________________________________

లోకాన్ని శాసించేది ఆ దేవుళ్ళు మాత్రమే అనుకున్నా
కానీ ఈరోజే తెలిసింది నీ కళ్ళు కూడా శాసిస్తాయని.
____________________________________________

అక్షరం రాయాలంటే లక్ష ఆలోచనలొస్తాయి
కానీ, నీగురించి రాయాలంటే క్షణంలో లక్ష అక్షరాలొస్తాయి.
________________________________________________

ధనం లేని వారు కాదు నీ దర్శనం దొరకని వారు నిజమైన నిరుపేదలు
కళ్ళు లేనివారు కాదు నీకళ్ళు చూడనివారు నిజమైన అంధులు
___________________________________________________

ఐసియు లో వున్న వ్యక్తికి ఆక్సిజన్ పెడితే బతుకుతాడోలేదో కానీ, నీ చేతిస్పర్శతో ఖచ్చితంగా బతుకుతాడు.
_________________________________________________

శూన్యంలో వేలాడే ఆ నక్షత్రాలు
మౌనంగా మాట్లాడే నీనయనాలు
వీటిని మించిన అందాలు
ఈ విశ్వంలోలేవు
_______________________________________

ఒక్క క్షణం నాకన్నులు మూసుకున్నాయి
తీక్షణమైన నీకన్నుల వెలుగులకు.
ఇక,
ప్రాణం పోయినా మూయనంటున్నాయి
దీనంగా నాకన్నులు నీవైపే చూస్తూ
_____________________________________

అందమంటే ఏంటని ఆదేవుణ్ణి వేడుకుంటే
నీవదనం చూపించి ఇదే అనిచెప్పాడు
__________________________________

నీచూపు నావైపు సోకనపుడు
నాఊపిరి నెవ్వరో ఆపినట్టుంటుంది.
___________________________________

నీ వాలుజడలో నాగుండెను దాచేసి
నీ నయనాలతో నాప్రాణాన్ని దోచేసి
నవ్వుతూ నిల్చున్నావు ఆనింగిలో జాబిలివై
మౌనంగా దాగున్నావు నాఎదలో దేవతవై
------------------------------------------------------------
ఉడుకుతున్నరక్తంతో అడుగువెయ్యి ముందుకు
ఉక్కులాంటి పిడికిలితో పిండిచెయ్యి పిరికితనాన్ని
పెచ్చులూడుతున్న ఈసమాజగోడలకు
పునాదిరాయివై పునఃనిర్మాణం చేయలేవా
విచ్చలవిడిగాసాగే నేరాలకు ఉఱితాడైరాలేవా
నిన్నే.
------------------------------------------------------------
గదిలో నాల్గుమూలల నడుమ
ఏం ఆడతావ్ దాగుడుమూతలు
కరిగే కన్నీటి సంద్రంలోని వేటకు
ఏం వేస్తావ్ ఎరలుగా నీకళ్ళను
మదిలో రగిలిన మంటలతో
ఏం నింపుతావ్ నీబతుకుకు వెలుగులను
నిన్నేరోయ్ అటుఇటు చూడకు
అద్దాన్నై నీ ముందున్నా

నదిలో సుడిగుండాల నడుమ
ఏం ఈదుతావ్ ముందుకు వెనక్కు
ఎదలోని భావాలను చూపలేవు
ఏం అర్థం చేసుకుంటావ్ ఎదుటి మనిషిని
ఆనందానికి అర్థం తెలీని నువ్వు
ఏం చూస్తావ్ జీవితపు రుచిని
నిన్నేరోయ్ అటుఇటు చూడకు
అద్దాన్నై నీ ముందున్నా.
---------------------------------------
అడుగుతున్నా నా అడుగుని
అగమ్యమైన ఈపయనం ఎంతవరకని
అడుగుతున్నా నా కన్నీటిని
ఆవిరై కనుమరుగయ్యేదెన్నడని
అడుగుతున్నా నా కళ్ళని
అంతులేని ఆ కలలకు కళ్ళెం ఎప్పుడని
అడుగుతున్నా నా మనసుని
అంతుచిక్కని భావాలెంతవరకని
అడుగుతున్నా నా ఎదసవ్వడిని
అలుపెరగని ఆ స్పందనలాగేదెన్నడని.
-----------------------------------------------
గుండె పిండేసిన నొప్పి
నరాలన్నీ చిక్కుపడినబాధ
కంటికి కనబడేదంతాకలలా
నా ఆలోచనలే నన్ను ఆహుతి చేస్తుంటే
నానుండి వచ్చిన మాటలతూటాలకు
ఏంజరుగుతుందో తెలీని నువ్వు బలయ్యావు.
చాలిస్తున్నా , శోధిస్తున్నా ,
బాధిస్తున్న నీఙాపకాలను 
నాగుండెల్లోనే ఎలామసిచేయాలా అని.
కానీ అదికూడా అసాధ్యం అనితెలిసింది.
---------------------------------------------------
మూతపడని  నారెప్పల ఆరాటానికి
మూతబడనివ్వని నీ అందానికి
సంబంధమేంటో నువ్వేచెప్పు
నిశ్శబ్దసమాధానం మాత్రం తప్పు..

ఆకాశాన్నంటే నాఆశలకు
ఆకాశానికి రాణివైన నీకు
సంబంధమేంటో నువ్వేచెప్పు
నిశ్శబ్దసమాధానం మాత్రం తప్పు..

నాఎదలోని లయల పిలుపులకు
ఎదురున్న నీ తీయని పలుకులకు
సంబంధమేంటో నువ్వేచెప్పు
నిశ్శబ్దసమాధానం మాత్రం తప్పు..

రేయింబవళ్ళు తేడా ఎరుగని నాకలలకు
రమణీయంతో కట్టిపడేసే నీ కనులకు
సంబంధమేంటో నువ్వేచెప్పు
నిశ్శబ్దసమాధానం మాత్రం తప్పు..
-----------------------------------------------
మనసుకు మరుపేలేదు
మరపుకు మందేలేదు
మరిచేది మనసేకాదు
మరిచిపోయేది ప్రేమే కాదు
మనసులేనిది మనిషే కాడు.
----------------------------------------------------
అటువైపోబాణం ఇటువైపోతూటా
ఏది ఎక్కువ నొప్పో చెప్పమంటే ఎలా
అటువైపు మనసు ఇటువైపు ప్రాణం
ఏది ఎక్కువో చెప్పమంటే ఎలా
ఒకరితో కలిసిఉండలేక
ఒకరిని వదిలి ఉండలేక
ఒక అడుగు అటు
ఇంకో అడుగు ఇటు
ఎటోతెలీని గమ్యం నాది.
ఏదోతెలీని వేదన నాది.
--------------------------------------------------------

నా ఎదలోతు తెలుసుకున్నానన్నావు
కనిపించని నాకన్నీళ్ళనే కనుక్కోలేకపోయావ్
నా జీవితమంతా ఉంటానన్నావు
నే జీవంచేదెందుకో తెలుసుకోలేక పోయావ్
నీఊపిరే నేనన్నావు
ఊహలకే అందకుండా వెళ్ళిపోయావ్.
ఆనింగికి చేరిన నీకోసం
ఈనేలపై జారవిడిచిన నీమనసుతో 
నీ నేను.
----------—----–——–—————------------------

దక్కాల్సింది దక్కలేదని దిక్కులు చూడకు
అక్కున చేర్చుకునే అవకాశం ఉండనేఉంటుంది.
చేజారిన క్షణాలతో కాలక్షేపం చేయకు
చెంతచేరే మరపురాని క్షణం రానేవస్తుంది.
మితిమీరిన ఆశలకోసం పాకులాడకు
అతి ఎల్లపుడూ అథోగతికే చేరుస్తుంది.
  —————————————----------------

కనిపిస్తోందా
వినిపించని నాకన్నీటి వేదన.

వినిపిస్తోందా
కనిపంచని నాహృదయపు రోదన.

దరిచేర్చుకోవా
దారెరుగని ఈ బాటసారిని,
మరికూర్చలేవా
విరిగిన నాహృదయగోడలను..
——————————-—
అందం నీచిరునామా ఐతే
నిను చేరే మొదటి మరియు
చివరి ఉత్తరం నేనౌతా.
మలినంలేని మనసు నీదైతే
ఆ మనసులోని తుది శ్వాసవరకూ
నన్ను నీకు అర్పించుకుంటా.
వెన్నెలనుమించే చిరునవ్వు నీదైతే
ఆ నవ్వులలో విరబూసే తామరను నేనౌతా.
___________________________

నా కళ్ళకు ఆకలి తీరదు
నిను ఎంతసేపు చూసినా.

నీ మనసుకు అర్థంకాదు
నా ప్రాణం పోతున్నా.

నా బతుకుకు అర్థంలేదు
నినుచేరని జీవితాన.

నా ప్రాణానికి విలువేలేదు
నీశ్వాసతో నిండనిక్షణాన.
______________________

నా మౌనరాగాలు నిను చేరేదెన్నడు
నా మదిలోని భావాలు నీకు తెలిసేదెన్నడు
నా కలలను దాటి నువు కలిసేదెన్నడు
నా ఎదురుచూపులకు నీ పిలుపెన్నడు.
------------------------------------

అందాన్ని వర్ణించమంటే
అద్దంలో నినుచూపించా
ప్రేమను వర్ణించమంటే
నా ఎదలోని నిన్ను
మరి ఎలాచూపను.             
________________________       

రాసేకొద్దీ రాయాలనిపించే ఒకేఒక్క కవిత
నీపేరు
చూసేకొద్దీ చూడాలనిపంచే ఒకేఒక్క అందం
నీవదనం
వినేకొద్దీ వినాలనిపించే ఒకేఒక్క మాట
నీ పెదాలలోనాపేరు.
నీవులేని జీవితం భారం
నీతోకలిసి జీవితం ఒక వరం.
____________________________


ఆరడుగుల గమ్యాన్ని చేరుకోడానికి
అంతులేని ఈఅడుగుల ప్రయాణం
మూడక్షరాల జీవితాన్ని అర్థంచేసుకోడానికి
ముగింపు లేని ఈ ఆలోచనల ప్రవాహం.
________________________________


ఏంకావాలంట ఆకళ్ళకు
ఏం ఇవ్వాలంట ఆ మనసుకు
నాకన్నీటితో పాదాభిషేకం చేయనా
నా ఊపిరితో ప్రాణాభిషేకం చేయనా
దేనికంట అందనంత ఆదూరం
నా దేహం నీధ్యానంతో దహనం అవుతున్నా..
____________________________________


మనుషులకు దూరంగా నేను
మనసు లోకంలో నిల్చున్నాను
మానవ లోకానికి ఒక మెట్టు పైన నిల్చొని
మానవత్వం కోసం ఎదురు చూస్తున్నాను
బంధాలూ అనుబంధాలూ
ప్రేమలూ ఆప్యాయతలూ
మరచిన మనిషి
ఆస్థులూ అంతస్థులూ
ధనం బలం అంటూ
తాను మనిషిని అని మరచాడు.
ఒక్క క్షణం ఊపిరి లేకుండా బతకలేని మనిషికి
లెక్క పెట్టలేనంత ఆస్థి ఎందుకో.
ప్రాణం పోసే ప్రేమకన్నా
ఆకలి తీర్చని ఆస్థులే ఇష్టమట.

ఓ భగవంతుడా
మానవత్వంలేని ఈ చీకటి లోకం నుండి
మనిషిని దూరంచెయ్యి.
____________________________________

అదిగో కనిపిస్తోందా
అందని ఆ ఆకాశం
అందలమెక్కాలనుకునే వారందరికీ
అదేగా ఆదర్శం.
ఇదిగో వినిపిస్తోందా
పిలుస్తోన్న గెలుపు పిలుపు
విజయాన్ని కోరుకునే వారందరికీ
ఇదేగా ఆయువు.
అడుగుముందుకేసి చూడు
ఆకాశం కూడా నీపాదాలకిందకి వస్తుంది.
మనసుపెట్టి చేసి చూడు
ప్రతిపనిలోనూ విజయం  నీచెంతకు చేరుతుంది.
________________________________________

ఎక్కడెక్కడి నదులన్నీ
నీ నడువంపుల్లో సేరి
ఏవేవో రాగాలన్నీ
నీ గాత్రంగా మారి
భువనైక మంజరివై నువ్వుంటే
నీచూపు సోకక నేను నిరుపేదనైనాను.

నడిరేయి నక్షత్రాలన్నీ
నీ నయనాలలో సేరి
సుతిమెత్తని పూరేకులన్నీ
నీ పాదాలుగా మారి
అతిలోక సుందరివై నువ్వుంటే
నీచూపు సోకక నేను నిరుపేదనైనాను.

ఓ భువనైక మంజరీ,అతిలోక సుందరీ
ఈ నిరుపేదపై చూపు నీ కరుణకటాక్షంబు.
_______________________________________


ఒక్కసారి తిరిగిచూడు
నామనసుని నీపాదాలకు అర్పిస్తా
ఒక్కసారి అడిగి చూడు
నాప్రాణాన్ని నీఎదలో నింపుతా
ఒక్కసారి వరమిచ్చి చూడు
నాదేవతలా నిను పూజిస్తా
ఒక్కసారి మనసిచ్చి చూడు
ఆ మరణానికి కూడా ప్రేమ రుచిని చూపిస్తా.
_____________________________________

నిన్ను నీవు నాలో చూసుకుంటావ్
నన్ను నేను నీలో చూసుకుంటా
నువు నవ్వితే నేనూ నవ్వుతా
నువు ఏడిస్తే నేనూ ఏడుస్తా
నీ ప్రతిరూపాన్ని నేను
నీతోనే కలిసున్నాను.
అవును
అద్దాన్ని నేను,నీ అందాన్ని చూసి నాకూ ప్రాణమొచ్చింది
కానీ
అద్దాన్నే కదానేను,అందుకే ముక్కలు చేసి ప్రాణంతీశావ్.
______________________________________________

తీరాన్ని దాటే ఓ అలా
వదిలెయ్యకు ఈ సాగరాన్నిలా ఒంటరిలా
నిదురను దాటే ఓకలా
వదిలెయ్యకు ఈ కళ్ళనిలా ఒంటరిలా.
గానం చేసే ఓ కోయిలా
వదిలెయ్యకు ఈ వసంతాన్నిలా ఒంటరిలా.
మనసును వీడే ఓ మధబాలా
వదిలెయ్యకు నా మనసునిలా ఒంటరిలా.
_____________________________________________


ఎక్కడని వెతకను ఈ మానవప్రపంచంలో
నా దేవతను
ఏ భాషలో పిలవను నాకురాని ఆ దైవభాషలో
నా దేవతను
ఎలా కలవను కలల్లో మాత్రమే దర్శనమిచ్చే
నా దేవతను.
అందుకే
వెదక లేక ఒంటరినై వున్నా
మాటలురాక మౌనినై వున్నా
కలలకోసం కన్నులు మూస్తున్నా.             
____________________________________


ధనమున్న ఓ పేదోడా
దయచేసి మాటవినరా
దయవున్న ఆ బీదోడిని
దయచేసి బతకనివ్వురా

ఆకలికి రూపముండదురా
అన్నదానానికి మించిందిలేదురా
ఆకలితో ప్రాణాలు పోయేవారొకవైపు
ఆకలంటే అర్థం తెలీనివారింకోవైపు.

విలాసవంతమైన మీ జీవితాలవెనుక
వెలకట్టలేని కష్టజీవుల స్వేదాశ్రువుల మరకలు
వినీలాకాశంలో విహరిస్తున్న మీ చక్షువులకు
వినిపంచని ఆకలి కడుపులుచేసే ఆర్థనాదాలు.

ధనమున్న పేదోడా
మనసున్న బీదోడిని
బతకనివ్వురా.
___________________________________

గుండెలవిసేలా రోదించి
కన్మీరు ఎండమావిలా మారి
ఆలోచనలన్నీ అగ్నిలో ఆహుతై
మరణశయ్యపై తనువుతగలబడుతుంటే
నా ఆత్మను నీలో ఆవాహన చేస్తున్నా.
____________________________________

చీకటిలో నాప్రయాణం
చెట్టు చేమలే నాప్రపంచం
నిశ్శబ్దపు రాగం
నిర్మాణుష్యపు తీరం
వెనకా ముందూ నేనే
దిక్కులన్నీ నావే
కనిపించేదంతా భ్రమ అని
కనులు మూసి నిజాన్ని మాత్రమే చూస్తూ
చీకటితో నాప్రయాణం
చెట్టు చేమలతో నా సావాసం.
____________________________________


వయసైపోయిన ప్రతి మనిషీ మరణిస్తాడు
మనసు విరిగిన ప్రతి మనిషీ మరణిస్తూ జీవిస్తాడు.
___________________________________________

ఎవరికోసమైతే ఎదరుచూస్తావో
ఎవరినైతే నిజంగాప్రేమిస్తావో
ఎవరికోసం ప్రాణమైనా ఇస్తావో
వారే నీ బాధకు మొదటి కారకులు
వారే నిను వదిలి వెళ్ళే మొదటి వ్యక్తి.
___________________________________

నీ ఏడుపుతో మొదలై
నీ వాళ్ల ఏడుపుతో ముగిసేది
నీ నవ్వుతో మొదలై
నీ వాళ్ళందరికీ పంచుతూ సాగించేది,
సవాళ్ళూ,ఆనవాళ్ళూ,కన్నీళ్ళూ మోస్తూ
పరిచయాలూ,పరవశాలూ,పులకింతలు తెస్తూ,
సాగేదే,
జీవితమనే వెనకడుగు లేని ప్రయాణం.
_______________________________________

భావానికి అందనిది
భావోద్వేగంతో నిండినది
భవిష్యత్ నాదే అనేది
బంధించి బాధించేదీ
బానిసను చేసి ఆడించేదీ
బతుకును మొత్తానికి మార్చేదీ
మరేముంటుంది ఈ ప్రేమకన్నా..
__________________________________


దివ్య మనోహరమైన నీ సౌందర్యం చూసి
దివి,భువన లోకాలన్నీ నీధ్యానంలో వుంటే
దీనంగా చూస్తూ నవ్వుకుంటావు
నీ కలల కోసం లక్షల కళ్ళు కలలుకంటుంటే
నీ ఊహకూడా అందకుండా దాక్కుంటావు
నీ పాదస్పర్శకోసం కోట్ల పెదాలు తపించిపోతుంటే
నీ సుకుమారపాదస్పర్శతో గడ్డిపోచలకు ప్రాణం పోస్తావు
బవబంధాలొదిలేసిన ఆ సన్యాసులను సైతం
బంధీలను చేసి అందకుండా జారుకుంటావు.
ఏమిటి ఈవిధి
ధర్మమా నీకిది.
__________________________________________

నాదికాని లోకంలోకి నను తోసేసినట్టు
నాకురాని భాషలో నన్నెవరో పిలుస్తున్నట్టు
నాకు తగిలిన గాయంకూడా నాకు నొప్పిలేనట్టు
నేనుంటే,
నన్నందరూ పిచ్చోడంటున్నారు.
నిజమేకదా,
ప్రేమంటే తెలీని పసిపిల్లల నవ్వులో
ప్రేమకు దూరమైన నా ఏడుపులో
అంతరార్థం ఆ దేవుడుకూడా ఎఱుగడుకదా.
________________________________________

విండోలోనుండివీచేగాలి
నీకురులతోనాట్యంచేయిస్తుంటే,
నా గుండెలో హరివిల్లుకు
ఎనిమిదోరంగు అంటుకుంది.
ఆకాశంలో వేలాడే ఆతారలు
నీ చెవిలోలాకుల్లామారి మిణుగురుమంటుంటే
నాకనుపాపలోని తడికి
కొత్త వెలుగుల ప్రపంచం చేరింది.
అందాన్నిగురించి వినడం, సినిమాల్లో చూడ్డమేకానీ
మొట్టమొదటిసారి కళ్ళారా చూసాక
అంతఅందాన్ని నాకళ్ళలో నింపే సాహసంచేసి ఓడిపోయా.
నీ అందానికి బానిసకాని మనిషి, మనిషేకాడు
నీ అందాన్ని చూడని బతుకు, బతుకేకాదు.
________________________________________________


రాసే నారాతలు పిచ్చిగీతలన్నావ్
మరి, చదివే నీకళ్ళలో కన్నీరెందుకో.
పలికే నామాటలకు భావంలేదన్నావ్
మరి, విన్నాక నీ పలుకులకు మౌనమెందుకో.
చూపే నాభావాలలో ప్రేమలేదన్నావ్
మరి, నను వదిలిన నీ మదిలో వెలితిఎందుకో.
_______________________________________________

అనంతమైన ఈప్రేమలో,
ఏది నిజమో ఏది భ్రమో
ఏది చీకటో ఏది పగలో
ఏది మనదో ఏదికానిదో
ఏది చావో ఏది బతుకో
అర్థంకాక,అర్థంచేసుకోలేక
అర్థాంతరంగా,ఆవేశంతో
అణువణువునా బాధతో,
మనసు విరిగి మౌనంగామిగిలి
ఆశలు కరిగి ఆకాశంలో కలిసిన
ప్రేమయోధులందరికీ
ఇదే నా అశ్రు నివాళి.
____________________________

ఇంతేకదా ఈప్రేమ
నమ్మినవారిని నిలువునాకోసేస్తుంది.
నమ్ముకున్నవారితోనే నరకంచూపిస్తుంది
ఇంతేకదా ఈప్రేమ
అందని కోరికలుపెంచి అందలమెక్కిస్తుంది
అందుకోలేవని నవ్వి ఆయువు తీస్తుంది.
____________________________________

పిచ్చోడి చేతిలోరాయి
చెవిటోడి చేతిలో శంఖం
గుడ్డోడి చేతిలో అద్దం
మూగోడి చేతిలో మైకు
నీ చేతిలో నా మనసు
ఉన్నా ఉపయోగంలేదుకదా.
_____________________________

నా అక్షరాలు,
అదుపుతప్పి, నీ ఎదనుతాకి,
మదిలోదూరి,నా మనో వ్యధను
నీకు అందజేసేదాకా
ఆగవు,అలసట చెందవు.
_______________________________

నా మనసు గాయం ఎవరికీ కనబడనిది
నా మౌనరాగం ఎవరికీ వినబడనిది
నాదొక కన్నీటి కావ్యం
నాదొక విషాద రాగం
నాకు నేనై,నాతో నేనే
నడిచే ఈ గమ్యం, నిలిచేదెక్కడో,
రాసే ఈ కావ్యం,ముగిసేదెన్నడో.
______________________________

కడసారి చూడమన్నావ్,
కన్నీళ్ళలో నాకు నీరూపంకనబడనేలేదు.
కడసారి మాట్లాడమన్నావ్,
నీ పలుకులను వింటూ మౌనంగా ఉండిపోయా.
కలకాలం సుఖంగా వుండమన్నావ్,
నవ్వాలో ఎడ్వాలో,
ఏడ్వలేక నవ్వాలో తెలీక,
కరుగలేని మేఘాన్నై,పొద్దేలేని రేయినై,
కాళ్ళున్న చెట్టునై,కదలలేని గాలినై,
నిలిచిపోయా నీఙాపకాలతో,
నిలిచిపోని ఈ కాలగమనంలో.
__________________________________


భరించలేని బంధాన్నయ్యానా
సహించలేని సఖుడనయ్యానా
అసహ్యించుకునే రూపాన్నయ్యానా,
దహిస్తుంటే నీఎడబాటు నా మనసును
దహనమవనీ నీ ఎదమాటున నామనసును.
_____________________________________

ఆకాశాన మెరిసే తారలు చూస్తూ
నేలన ఉన్న వజ్రాలను తొక్కేస్తూ
చేజార్చుకున్న మనసుతో
ఎక్కడికి నీ పయనం
ఎందాక నీప్రయాణం.
_______________________________________

ధగధగ భగభగ ఎగసే మంటవు
తళతళ మిలమిల మెరిసే తారవు
గణగణ గణగణ మోగే కంఠం
వడివడి వెడవెడ సాగే సింగం
బుస బుస రుసరుస పొంగే లావా
జలజల గలగల పారే ఏరువు.
దడదడ లాడెను దొరలగుండెలు.
కసికసిగా బిగిసెను తాడు
మెలమెల్లగ ఆగెనుశ్వాస
నల్లని రంగున నిండెను ఆకసం
జలజల రాలెను నేలకుతారలు
ఢమఢమ మోగెను ఢంకానాదం.
భరతమాతకు నెత్తుటితిలకం
భారతీయులకు రక్షణకవచం
నువ్వే నువ్వే యువకులకింగ్
భగభగమండిన భగత్సింగ్.
__________________________

ఆకలి,దప్పిక
శ్వాస,మరియు నీ ప్రేమ,
ఇవన్నీ నాశరీరం ఉన్నంతవరకూ
నను వీడవు.
____________________________

ఎవరున్నారని నీకైనా
ఏమన్నారని నీరోదన
కలగన్నావా ఏనాడైనా
కన్నీళ్ళే నీతోడౌతాయని.
తెలిసిందా ఈనాడైనా
ప్రేమంటే ఆరనిమంటని.
వీడిన మనసుకు వేదన మిగిలితె,ఆ
వేదన తీర్చే వేదం ఏది
మనసును మార్చే మంత్రం ఏది.
_____________________________

అన్యాయమో అరాచకమో
అధర్మమో అక్రమమో
చూసి చలించిననన్ను
నీకెందుకులే ఊరుకొమన్నావ్
కనిపించని ఓనామనసా.
ఇటుచూడు ఆకలి కడుపున ఆర్తనాదం
అటు చూడు వెకిలి చేష్టల యువసమాజం
అడుగులో అడుగేస్తూ
అడుగడుగునా దగాపడుతూ
అడిగేదిక్కేలేని ఎడారిబతుకులు
నిండని కడుపుతో సాగే ఎండమావులు
తీరంఏదో తెలీని తెగిన పతంగాలు
గమ్యమంటూలేని ఆజన్మ బాటసారులు.
వదలరుచూడు వారినికూడా
వేధించే ఈ వేటగాళ్ళు,
మనసేలేని మానవమృగాలు.
కనిపించని ఓనామనసా,
వీరి వధకు సమరశంకం ఇకనైనా పూరిస్తావా
వారి వ్యధకు చరమగీతం ఇకనైనా ఆలపిస్తావా.
_______________________________________

నవ్వే హృదయానికి నవ్వించగలిగే హృదయం
దొరకడం పెద్దకష్టం కాదని,
ఏడ్చేహృదయాన్నికూడా నవ్వించగలిగే హృదయం
దొరకడం చాలాకష్టమని నేనంటే,
నవ్వుతెందుకు ఈలోకం?
పగిలిపోయిన హృదయాన్ని అతికించడం
కష్టమంటుంది ఈలోకం
మరి ప్రాణంగా ప్రేమించినవాళ్ళహృదయాలే
ఎందుకు నలిగిపోతున్నాయంటే,
ప్రాణంకన్నా ఎక్కువగాప్రేమించిన వాళ్ళే
ప్రాణాలు తీస్తున్నారని నేనంటే
నవ్వుతుందెంకు ఈలోకం?
ప్రేమలో లోపంఉందా?
ప్రేమించడంలో లోపముందా?
ప్రేమించే మనుషులలో లోపముందా?
ప్రేమించబడే మనుషులలో లోపముందా??
సమాధానమివ్వే ఓ లోకమా??
సమాధికానివ్వకే నాప్రాణమా.

_____________________________________

ఏది నీదంటావు
ఏది కాదంటావు
ఏది ఎవరిదో ,ఏది నీదో
తెలుసా నీకైనా,తెలుసుకో ఓనా మనసా.
దక్కినది వద్దంటావు
దక్కనిదే కావాలంటావు
దక్కించుకోలేని నిన్ను చూస్తుంటే
దుఖం వస్తోంది నాకన్నులకు.
దిక్కులు చూస్తూ,దారులు మారుస్తూ
దిశలేని నీగమనం
ఏగమ్యం చేరునే,
దిగులుపడే ఈహృదయం
ఏదరికి చేరునే.
_______________________________________

దాచుకున్న ధనం పోనీ,
కూర్చుకున్న జనం పోనీ,
పేర్చుకున్న ఆశలు పోనీ,
చివరకు,
కనిపెంచిన వాళ్ళుపోనీ,
బతకగలకనంటావు కదూ.
కానీ,

మనసిచ్చిన మనిషి వీడితే




చావే నీతోడని చెప్పి నను చంపకే
ఓనా మనసా.
______________________________

నీ గుండెను గుడిలో ఉంచెయ్
నీ మనసును ప్రేమతొనింపెయ్
నీ కున్న వన్నీ లేనోళ్ళకు ఇచ్చయ్
నీ శ్వాసను ఆశగా చేసి
వెయ్యిముందుకు అడుగు
వేలమంది వెయ్యాలి నీఅడుగులో అడుగు
వేలయేళ్ళు బతకాలి అమరుడవై
వేలగుండెల్లో నిలవాలి అజరామరుడవై
__________________________________


కనికట్టు విద్య నేర్చుకున్నావా
కళ్ళముందే ఉన్నట్టుగా కనికట్టు చేసేశావ్
శస్త్ర విద్యను నేర్చుకున్నావా
అస్త్రములేకుండానే నాఎదను తెరిచావు
మానసిక విద్యను కూడా నేర్చుకొనిఉండు
మనసువిరిగితే నాకు నయం చేయడానికి
దైవ విద్యతో సిద్దంగాఉండు
దేహంవీడిన నా ఆత్మను నీలో కలుపుకునేందుకు.
_________________________________________

చూస్తున్నావా ననుచూసి నవ్వుతున్న ఈలోకాన్ని,
మోస్తున్నాను మనసులేని వారి మాటలభారాన్ని,
ఛస్తున్నాను నీవులేని ఈబతుకులో
బతకుతున్నాను చావురాని ఈమనసుతో
వస్తున్నావా ఇకనైనా నాచెంతకు.
_________________________________________

మనల్ని ఇష్టపడేవారు దొరకడం ఆనందం,
మనల్ని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించేవారుండడం వరం,
మన కష్టాల్ని వారికష్టాల్లాగా భావించేవారు దొరకడం అదృష్టం
వీరిని వదులుకోవడం ప్రాణాన్ని వదలడం రెండూసమానమే.
_________________________________________________

మూడురోజులనుండి ముద్ద యెరగనోయి
ఆకలనుటకు కూడ నోరు తెరవలేను
కాలుమెదపలేక కూలబడితి
దైవమైన నిన్ను దేహియంటున్నా
దయను చూపమంటు దేహమప్పుగ పెడితి
నారు పోసినోడె నీరుపోస్తడంట
నాదు బతుకు లోన ఏమిలేదే
ఒక్క మెతుకు మరియు చుక్కనీరు
ఇవ్వగలిగితె ఇమ్ము
లేదుయనిన నన్నె గొనుము
బక్కచిక్కినాను బతుక లేను.
_______________________________________

ఎగిరేసెయ్ చొక్కాకాలర్
నిలదీసెయ్ నిర్భయమ్ముగా
అన్యాయము నాకు కాదుగా
అనుకోకుర ఫక్కున నవ్వి
రేపన్నది నీవంతైతే
కాపాడే దెవ్వరునిన్నే
ఎగిరేసెయ్ చొక్కాకాలర్
నిలదీసెయ్ నిర్భయమ్ముగా

కనులెదుటే కసాయివారు
కరుణించకు కడవరకైనా
బలముండగ గుండెల్లోన
అలుపెరగకు గెలిచేవరకూ
ఎగిరేసెయ్ చొక్కాకాలర్
నిలదీసెయ్ నిర్భయమ్ముగా

నరనరమున నీతిని నింపి
అడుగడుగున ఆశయమ్ముతో
అడుగెయ్రా నిజాయితీగా
విడిచెయ్యకు విద్రోహులను
ఎగిరేసెయ్ చొక్కాకాలర్
నిలదీసెయ్ నిర్భయమ్ముగా
___________________________

నా ప్రతి ఆలోచనకీ అర్థం నీ తలపే
నా ప్రతి గుండె చప్పుడికీ శబ్దం నువ్వే
అందుకే ఇప్పుడు,
నా ప్రతి కన్నీటి బొట్టుకీ సమాధానం నువ్వే
నా ప్రతి తప్పటడుగుకీ తొలి అడుగునీదే

నా ప్రతి అక్షరంలోను, మాటలోనూ, మౌనంలోనూ
నువ్వే కనబడుతూ
నన్నే నానుండి విడగొట్టావు
నువ్వై నిలిచి నవ్వుకున్నావు.
________________________________________

ఆశల హాహాకారాలు హోరెత్తుతుంటే
మదిలోని దిగులేమో తరగనంటూంటే
మాటలు మౌనం పూని
గుండెను నలుపుతు వుంటే
అవి ఏమీ యెరుగనట్టు
నీకేసంబంధం లేనట్టు
వదిలేసి నువ్వు నడిచెళ్ళి పోయావు
పడదోసి నన్ను నరకగుండంలోకి.
________________________________

నువు నన్ను చూస్తుంటే
నన్ను నేను గిల్లిచూసుకున్నా
నన్నేనా నువు చూస్తోందని
నాపైనేనా ఆచూపని.
అప్పుడు నువు నవ్విన నవ్వుతో
పువ్వుల వర్షం మనసులో కురిసి
రివ్వున నింగిని చేరి
ఆ చంద్రుణ్ణీ చుక్కల్నూ తెంపి
నేలకు విసిరేసి నీముఖాన్నీ కన్నులనూ
 విశ్వమంతటికీ చూపించి నిరూపించమన్నా,
 ‎వాటిని మించిన అందం ఏదని
 ఆవెలుగులను మించే మెరుపెక్కడుందని.
______________________________________

ఆగని ఈ ఎక్కిళ్ళకు కారణమే నువ్వంటూ
పొంగిన నాకన్నీళ్ళే సాక్షమయ్యాయి
తరగని నాతలపులకు ఆయువు నీవంటూ
కరిగిన నాహృదయం మూగబోయింది
________________________________________

అక్షరం అక్షరం పోగేసి
కవితామాలను చేసి నీకంకితమిస్తే
ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపొమ్మంటూ
పక్కనపడేసి తప్పుకున్నావు.
కాగితాలు ఎగిరిపోవచ్చునేమో కానీ
ఆగని నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను
లాగుతూ ఎదను కోస్తున్నాయి.
_____________________________________

ఆకళ్ళకు లొంగని ఒళ్ళుండదు
ఆనడుమును తాకిన తనువాగదు
ఆజడతో ఉరి కాని గుండెలె లేవు
ఆపెదాలు పిలిస్తే పలుకని ప్రాణాలు లేవు
ఆఅందాన్ని వర్ణించడానికి వందల భాషలైనా సరిపోవు
అంతటి అందానికి నను బంధీని అయ్యే అవకాశం
నాకందిస్తావని ఆశిస్తూ......
_________________________________________



                 మీ వంశీ...