‘‘మనం ఇక్కడికి వచ్చాం అని చెప్పి వాడినీ రమ్మనక పోయావా!’’ అన్నాడు శరత్.
‘‘రమ్మన్నాను. నాకు ఎలా కుదురుతుంది రా కష్టం అన్నాడు.’’ చెప్పాడు రమేష్.
‘‘మనందరం బాగానే సెటిల్ అయిపోయాం. ఇల్లు కట్టుకున్నాం. డబ్బు సంపాదించుకున్నాం. పాపం శంకరం జీవితమే పాడైపోయింది. చదువు లేదు. జీవితంలో స్థిరపడలేదు. ఎలా ఉన్నాడో ఏమిటో. చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే అందరిలోకి వాడే ఇంటెలిజెంట్. అదృష్టం కలిసి రాలేదు.’’ అని బాధపడ్డాడు రామచంద్రం.
అందరూ భారంగా నిట్టూర్చారు.
వాళ్ళు ఐదుగురు ఓకే సారి గుంటూరులో ఇంటర్‌లో జాయిన్ అయ్యారు.
ఆ సమయంలోనే శంకరం తండ్రి ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోయాడు. బలమైన దెబ్బలు తగిలాయి. దాంతో పెద్దకొడుకైన శంకరం అర్ధాంతరంగా చదువు వదిలిపెట్టి వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.
మిగిలిన నలుగురు మంచి చదువులు చదివారు అందరూ విదేశాలకు వెళ్లి పోయారు.
రామచంద్ర జర్మనీలో ఉంటాడు. ముకుంద్, శరత్ యుఎస్.లో వుంటారు. రమేష్ ఆస్ట్రేలియాలో వుంటాడు. అందరూ ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయారు. చుట్టపు చూపుగా మన దేశానికి వచ్చి వెళ్తుంటారు. వేసవికాలంలో శుభకార్యాలు చాలా ఉంటాయి. రెండుమూడేళ్లకు ఒక్కసారైనా ఎండాకాలంలో వస్తూనే ఉంటారు. అందరూ హైదరాబాద్ వాళ్ళే అవటం వల్ల మూడు నాలుగు సార్లు కాకతాళీయంగా నలుగురు కలిశారు. ఏ హోటల్‌కో వెళ్లి సరదాగా సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవడం అలవాటు.ఈసారి కూడా అలాగే కలిశారు.
నలుగురు ఉన్నప్పుడు శంకరం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా ఏళ్లయిపోయింది వాడిని చూసి. అని బాధపడ్డారు. ‘‘వాడికి రావడం వీలు కావట్లేదు. వాడి పరిస్థితి ఏమిటో! ఆర్థికంగా ఎలా ఉన్నా డో? అది పైకి చెప్పలేక వీలు కాలేదు అంటున్నాడేమో!’’ సందేహం వెలిబుచ్చాడు రమేష్.
‘‘నాకో ఐడియా వచ్చింది. వాడికి వీలుకాకపోతే మనం వెళ్లి చూసి వద్దాం.’’ అన్నాడు ముకుంద్.
‘‘ఎలా వెళ్తాం. వీలవద్దా’’ అని ముగ్గురూ వెనక్కి తగ్గారు.
‘‘వీలు చేసుకుందాం. అంతదూరం నుండి వచ్చిన వాళ్ళం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేమూ!
ఎంత ఇవాళ రాత్రి బయలుదేరితే ఎల్లుండి పొద్దునకి వచ్చేయొచ్చు. ఎన్నాళ్ళయింది వాడిని చూసి.’’ అన్నాడు ముకుంద్.
ముందు కాస్త వెనకాడినా వెళ్లాలని అనిపించింది వాళ్ళకి. వాడు ఉన్నాడో లేదో కనుక్కుని అప్పుడు ప్లాన్ చేద్దాం అన్నాడు రామచంద్ర. ‘‘ఇప్పుడే ఫోన్ చేస్తాను’’ అన్నాడు రమేష్. వెంటనే శంకరంకి ఫోన్ చేశారు.
‘‘వద్దామనుకుంటున్నాం’’ అనగానే శంకరం ఆనందం అంతా ఇంతా కాదు .
‘‘రండిరా ఎన్నాళ్ళయిందో కలుసుకుని!’’ అన్నాడు సంబరపడిపోతూ.
‘‘ప్రోగ్రాం సెటిల్ చేసుకుని నీతో చెప్తాం.’’ అన్నాడు రమేష్.
రైలు బస్సు అంటే టికెట్లు దొరకొచ్చు దొరక్కపోవచ్చు...అందుకని కారులో వెళ్దాం అనుకున్నారు. ఫలాని రోజున వస్తున్నట్లు ఫోన్ చేయగానే శంకరం పరమానంద పడిపోయాడు. ఒక్క రోజే ఉంటారు అని తెలిసి నీరుగారిపోయాడు.
‘‘అదేమిట్రా రాకరాక వస్తున్నారు నాలుగు రోజులు ఉండచ్చు కదా’’ అన్నాడు.
‘‘కాదులేరా ఈ ప్రయాణమే బ్రహ్మ ప్రళయం. నిన్ను చూడాలి అని అతి కష్టం మీద బయలు దేరుతున్నాం’’ అన్నాడు రమేష్.
‘‘అవున్లే అదీ నిజమే. వస్తున్నారు అదే పదివేలు’’ అన్నాడు శంకరం.
ప్రయాణానికి సిద్ధమయ్యాక మిత్రులు నలుగురు కలిసి ఓ విషయం చర్చించుకున్నారు.
‘‘వాడు సరిగ్గా చదువుకో లేదు ఎలా ఉన్నాడో ఏమిటో. మనం బాగానే ఉన్నాము కదా వాడికి తలా కొద్దిగా డబ్బు ఇద్దాం. అవసరానికి వాడుకుంటాడు.’’ అన్నాడు శరత్.
‘‘తీసుకుంటాడా! ఏమీ అనుకోడు కదా!’’ అన్నాడు రమేష్.
‘‘పిల్లలకి ఏదైనా కొనమని చేతిలో పెడదాం.’’ సలహా ఇచ్చాడు రామచంద్ర.
తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరారు. మంచి కారు. రోడ్లు బాగున్నాయి కాబట్టి పది గంటలకి పావు గంట ముందే గమ్యం చేరారు. శంకరం వాళ్ల ఊరు గణపతిపాలెం. పల్లెటూరు. మెయిన్ రోడ్డు మీద నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. మెయిన్ రోడ్డు మీదనే వేచి ఉన్నాడు శంకరం. పంచె, పైన చొక్కా, నుదుట విభూది పట్టెలు. బొట్టు. నువ్వులు బియ్యం కలిపినట్లు వున్న కురచ జుట్టు. చిన్న పిలక. అదీ అతని అవతారం. ఖరీదైన బట్టలు వాచీ,అందమైన కళ్ళజోడు, ఘుమ ఘుమలాడే పెర్ఫ్యూమ్ పరిమళాలు వెదజల్లుతూ దర్జాగా వున్న ఆ నలుగురి ముందు దిష్టి బొమ్మలా వున్నాడు. అంతకాలం తర్వాత కలిసిన మిత్రులు ఆనందంలో మునిగి పోయారు. తన మోపెడ్ మీద వాళ్ళకు దారి చూపించాడు. ఇంటి ముందు ఆగారు. విశాలమయిన పెంకుటిల్లు. ఇంటి చుట్టూ కొబ్బరి మామిడి, వగైరా చెట్లు. ఇంటిముందు పెద్ద వేప చెట్టు. గేటు దాటి లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి..
‘‘కాళ్ళు కడుక్కొండి’’ అని నీళ్ళు అందించింది.
ఆ పద్ధతి పాటించి ఎన్నో ఏళ్ళు అయింది. షూస్ విప్పి కాళ్ళు కడుక్కున్నారు.
‘‘రాండిరా’’ అంటూ హాల్లోకి తీసుకు వెళ్ళాడు.
క్షణంలో కొబ్బరి నీళ్ళు ఇచ్చింది ఇంకో అమ్మాయి. పెద్ద హాలు. కిటికీ బయట కూలర్ పెట్టారేమో చల్లగా వుంది. ముందు వరండా, మూడు గదులు, హాలు, విశాలమైన భోజనాల గది, వంటిల్లు, కొట్టు గది, పూజగది, దొడ్లో పెద్ద పూరిల్లు. ఇంటికి తగ్గట్టు మనుషులు. శంకరం తల్లి తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు పెద్ద కోడలు, ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు. అందరినీ పేరు పేరునా పరిచయం చేశాడు. ఆ వూరి శివాలయం అర్చకత్వం వీళ్లది. తండ్రికి యాక్సిడెంట్స్ అవటంతో ఆ బాధ్యత శంకరం తీసుకున్నాడు. ఆయనకు అర్చకత్వం మాత్రమే కాకుండా జ్యోతిష్యంలోనూ ప్రవేశం వుంది. పెద్ద తమ్ముడు పక్క వూరి స్కూల్లో టీచర్. అతని భార్య గృహిణి. రెండో వాడు దగ్గరి వూళ్ళో గుళ్ళో ఆర్చకత్వం. అతని భార్య పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తోంది. శంకరం పెద్ద కొడుకు అతని భార్య పక్క టౌన్‌లో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నారు. రెండో కొడుకు రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాష్టర్. భార్య గృహిణి.
తమ్ముళ్ళ పిల్లలు చదువు కుంటున్నారు.
అందరూ కలిసి ఆ ఇంట్లోనే వుంటారు.
ఇంట్లో వున్న వాళ్లంతా వీళ్ళని ఆప్యాయంగా పలకరించారు.. భోజనాల వేళ అయింది. వీళ్ళు కింద కూర్చోలేరు అని బల్ల మీద అరిటాకులు వేసి వడ్డించారు. కోడళ్ళు సాయం చేస్తుంటే శంకరం తల్లి స్వయంగా వడ్డించింది. వంకాయ కూర, కొబ్బరి మామిడి పచ్చడి, పప్పు, ధప్పలం, కొత్త ఆవకాయ,పూర్ణం బూరెలు,పులిహోర, తినేసరికి భుక్తాయసం వచ్చింది. హాల్లో మంచాలు వేసి పక్కలు వేశారు. కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయారు. లేచే సరికి నాలుగు అయింది. తాటి ముంజలు రెడీగా ఉన్నాయి. సాయంత్రం గుడికి తీసుకు వెళ్ళి అర్చన చేయించాడు శంకరం. తరువాత వూరు చూపించాడు. వూళ్ళో అందరూ శంకరాన్ని ఆదరంగా పలకరిస్తూనే వున్నారు.
తమ పొలాలు చూపించాడు.
‘‘అప్పట్లో నాలుగు ఎకరాలు వుండేది. ఇంకో నాలుగు ఎకరాలు కొన్నాం.
చవకలో కొన్నాం. రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు ఎకరం నలభై లక్షలు వుంది’’ అన్నాడు. ఇంకా తాటి తోపు, జీడి మామిడి తోట కూడా వున్నాయి. అందరూ ఇంటికి చేరారు. బయటికి వెళ్ళిన ఆ ఇంట్లోని వాళ్ళు అందరూ గూటికి చేరారు. అప్పటి దాకా వున్న సందడి రెట్టింపు అయింది. ఆ ఇంటి వాతావరణం చూస్తూ వుంటే టైమ్‌మెషిన్‌లో ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపించింది. ఇంటి యజమాని దర్జాగా వున్నాడు. కొడుకులు పెద్ద వాళ్ళై సంపాదనపరులు అయినా నాన్న గారూ అంటూ అన్నీ ఆయనకి చెప్తున్నారు. ఇంటిల్లపాదీ ఆయన్ని గౌరవిస్తోంది. కొడళ్ళకి ఓ మాట చెప్పటానికి అత్తగారు అగ్గగ్గ లాడటం లేదు. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు, చెయ్యని ఆడవాళ్లు ఒకే విధమైన గౌరవాన్ని పొందుతున్నారు, ఎవరి స్థానం వారిది. ఎవరి విలువ వారిది. ఐకమత్యంగా వున్నారు.
ఏదైనా తినమని చేతికి ఇవ్వగానే ‘‘అన్నయ్యకి ఇచ్చారా’’ అని తమ్ముళ్ళు, ‘‘వాడు తిన్నాడా’’ అని అన్నయ్య ధైర్యంగా భార్యని అడుగుతున్నారు.
ఇక పిల్లలు ఎవరి పిల్లలు ఎవరో కనుక్కోటం పెద్ద నాన్నా, బాబాయ్ అంటూ చుట్టుకు చుట్టుకు తిరుగుతున్నారు. ఇదంతా కృతకంగా లేదు సహజంగా వుంది. ప్రేమ అనురాగం అనే దారంలో గుచ్చిన ముత్యాలహారంలా వుంది ఆ కుటుంబం.
‘‘మా శంకరం పాపం ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్ళడు. ఈయన వ్యవహారం ఏం చెప్పమంటారు నాయనా! బొత్తిగా పసిపిల్లాడికి మల్లే పెద్ద కొడుకుని ఎక్కడికీ వెళ్లనివ్వరు.’’అని తల్లి అంటే ‘‘నాదేముంది గానీ అదే వాడిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు.’’ అన్నాడు ఆయన.
‘‘అదేమీ కాదు. నాన్న గారిని, గుళ్ళో దేవుడినీ వదిలి నేను ఉండలేను. అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా అమ్మ చేతి భోజనం తింటున్నాను. నా అదృష్టం రా’’ అన్నాడు శంకరం.
వాళ్ళని చూసి చెప్పలేనంత తృప్తిగా అనిపించింది వీళ్ళకి. రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మిత్రులు అయిదుగురు. తెల్లవారగానే తిరుగు ప్రయాణం. వీళ్ళకు పంచెల చాపు, భార్యకు జరీ చీరె పెట్టారు. వీళ్ళు వెళ్తుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి శంకరానికి.
‘‘నా పరిస్థితి చూశారుగా. గుడిని, అమ్మా నాన్న గారి నీ వదిలి రావటం కష్టం.
మీరే వచ్చారు నాకు పరమానందం గా వుంది’’ అన్నాడు.
ఇంట్లోని వాళ్లంతా గేటు బయటికి వచ్చి ఆదరంగా సాగనంపారు. కారు వూళ్ళో నుంచి వెళ్లి రోడ్ ఎక్కింది. నలుగురూ మౌనంగా ఉండిపోయారు. శంకరం ఇల్లు ఆ వాతావరణం వాళ్ళను వెంటాడుతోంది. ఏదో చెప్పలేని ఆవేదన కలుగుతోంది. వాళ్ళకు కూడా తల్లితండ్రులు, అన్నదమ్ములు వున్నారు. కాకపోతే ఎవరికి వారే అన్నట్లు వున్నారు. ఎప్పుడో మూడెళ్లకో నాలుగేళ్లకో ఒకసారి కలుస్తారు. ఒకరి పట్ల మరొకరికి ఆపేక్షలు, ప్రేమలు వున్నాయి. రమేష్ అమ్మ, నాన్న, వృద్ధాశ్రమంలో వుంటున్నారు. అన్ని వసతులు వున్నాయి. రామచంద్ర అమ్మ నాన్న ఇంట్లోనే వున్నారు. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు.పెద్ద వాళ్లిద్దరే. ఏ మాత్రం తేడా చేసినా ఆవిడే పరుగులు పెట్టాలి పాపం. ముకుంద్ అమ్మా నాన్నా బాగానే ఉన్నారు. ఇంకా ప్రయాణం చెయ్యగల ఓపిక వుంది. కానీ అతని భార్యకు వాళ్ళంటే పడదు. శరత్ తల్లిదండ్రులు ‘‘ఆ ప్రయాణాలు మేము చెయ్యలేం.
మాకు అక్కడ కాలక్షేపం కాదు. తీరా అక్కడికి వచ్చి అడ్డం పడితే కష్టం’’ అని చెప్పేశారు.
తోడ బుట్టిన వాళ్ళు ఎవరికి వారే యమునా తీరే. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇండియా రావటానికి ఆసక్తి చూపించరు.
అందరినీ చూద్దాం అని వీళ్ళు పోరి తీసుకు వచ్చినా వాతావరణం మార్పు వల్ల అనారోగ్యాలు, వూరి ప్రయాణాలు. మొక్కులు చెల్లించుకోటాలు ఆ హడావిడితోనే సరిపోతుంది. మళ్లీ ఎవరి గూటికి వారు చేరటం. వాళ్లేం కష్టాలు పడటం లేదు. సంపన్న దేశాల్లో నివాసం.వున్న చోట మిత్రులు వున్నారు. అందరూ కలిసి మెలిసి వుంటారు. కానీ రక్త సంబంధం వున్న వాళ్లంతా దూరం గానే వున్నారు.
‘జేబులో వున్నదే రూపాయి. దగ్గర ఉన్నవాడే కొడుకు’ అని సామెత చెప్పినట్లు అమ్మ నాన్న దగ్గర వుండే అదృష్టం మాత్రం లేదు. అదీ అలవాటైపోయింది. పరిస్థితులతో రాజీ పడి సుఖంగానే వున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వూరు వెళ్లి శంక రాన్ని చూసేసరికి మనసులో ఏదో పోగొట్టుకున్న భావన. ఎంత కోరుకున్నా అటువంటి అవకాశం తమకు లేదు కదా అనే నిర్లిప్తత.
కాసేపటి తర్వాత నోరు విప్పాడు రామచంద్ర.
‘‘ వాడు తక్కువగా ఉన్నాడేమో అనుకున్నాం. నిజం చెప్పాలంటే మనకంటే సుఖంగా వున్నాడు వాడు.’’ అన్నాడు.
‘‘అవును. సమయానికి వాడి ఫోన్ దొరకటం ఇట్లా వెళ్ళిరావటం మంచిదే అయింది. వాడిని చూశాక తృప్తిగా వుంది’’ అన్నాడు రమేష్.
‘‘వాడు ఏదో కష్టాలు పడుతున్నాడు. సాయం చేద్దాం అనుకున్నాం. వాడికేం. మహారాజు’’ అనుకున్నారు.
మొదటి సంఘటన ముంబాయిలో జరిగింది. ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడున్నన్ని కార్లు లేవు. ఒకాయనకు ఒక two wheeler ను కొనుక్కోవాలని బలమైన కోరిక కలిగి , కొంతకాలానికి కొని , ఒక రోజు దానిమీద సంతోషంగా వెళుతుంటే ముంబాయి కి కొద్ది దూరంలో ముగ్గురు వ్యక్తులు ఆయన్ని ఆపి , కొట్టి ఆయనకొన్న బజాజ్ టూవీలర్ ను , డబ్బును లాక్కొని వెళ్లారు.ఆ ముగ్గురిలో ఒకడు వాపసు వస్తుంటే చాలా నీరసంగా వున్న ఈయన తనకు సహాయం చేయడానికొస్తున్నాడేమో అనుకొన్నాడు. కాదు మూడవవాడు ఈయన్ని మరోమారు గట్టిగా కొట్టి , వేలికున్న ఉంగరాన్ని , ఖరీదైన కోటును , ఆఖరికి బెల్టు , టై ని కూదా లాక్కొనివెళ్ళాడు. అరగంట తరువాత స్పృహ వచ్చి సహాయం అడిగినా ఎవరూ రాలేదు. కష్టపడి దగ్గర్లోవున్న చెట్టు కింద కూలబడ్డాడు. అపుడు కాయగూరలు అమ్మే ఒకామె ఈయన పరిస్థితి చూసి , నీళ్ళు ఇచ్చింది. నడిపించుకొంటూ తన గుడిసె కు తీసుకెళ్ళి రెండు రొట్టెలు పెట్టి , మళ్ళీ ఒక ఆటోలో కూర్చొబెట్టి ఇంటికి పంపించింది.
ముంబాయిలో ఒక ఆసుపత్రి లో తన భార్యకు ఒక పెద్ద ఆపరేషన్ చేయించి , డబ్బు చెల్లించేందుకు చాలా కష్టపడుతున్న ఒక పేద వ్యక్తి , కౌంటర్ దగ్గర పాత పర్సు తీసి అప్పు చేసి తెచ్చిన డబ్బును చెల్లించబోతుంటే , పర్సులో అతను పెట్టుకొన్న పోటో ను చూసి , పక్కనున్న ఆయన '' ఈమె మీ భార్య నా ? '' అని అడిగాడు. ' అవును, ' అన్నాడు అతను. అపుడు ఆయన '' మీరు డబ్బు చెల్లించవద్దు , ఆమె ఆపరేషన్ ఉచితంగా చేస్తాం , మీరు దిగులుపడకండి ,'' అన్నాడు.
ఆపరేషన్ చేయించుకొంటున్న ఆమె ఎవరు ? ఆరోజు కాయగూరలు అమ్ముతున్న ఆమె.
ఆపరేషన్ ఉచితంగా చేస్తాము అన్న ఆయన ఎవరు ? దొంగల చేతిలో దెబ్బలు తిని , డబ్బు , వాహనం , ఉంగరం కోల్పోయిన అతనే. అతను ఒక డాక్టరు. ఆమెకు ఆపరేషన్ చేసి , ప్రాణం నిలబెట్టింది కూడా ఆయనే. కర్మ కు ఙ్ఞాపకశక్తి చాలా ఎక్కువ.
రెండవ సంఘటన అమెరికా లో జరిగింది. హ్యారీ , జార్జి స్నేహితులు. కలిసి వ్యాపారం చేస్తున్నారు. మంచి లాభాలు వచ్చాయి. అప్పటికింకా ఇద్దరూ ఇంకా పెళ్ళికానివారే. లాభాలు వస్తున్న సంధర్భాన్ని celebrate చేసుకోవడానికి హ్యారీ తన ఇంట్లో జార్జి కి పార్టీ ఇవ్వాలనుకొన్నాడు. ఆ సాయంత్రం జార్జి వస్తున్నాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు పుడుతున్నాయి. పార్టీ లో ఇద్దరూ కబుర్లు చెప్పుకొన్నారు. హ్యారీ ని తొలగించుకొంటే లాభాలన్నీ తనకే కదా అనే పాడు ఆలోచనతో - అక్కడున్నది తామిద్దరే కాబట్టి ఏమి చేసినా ఎవ్వరికీ తెలియదు కాబట్టి - గది తలుపుకు వెనకభాగన వేలాడదీసిన ఒక హాకి బ్యాట్ తో హ్యారి తలపై గట్టిగా బాది చంపి , ఆ రాత్రే అతని శవాన్ని కారులో వేసుకొని వందమైళ్ళ దూరంలోని నీటిగుంటలో పడేసాడు. మనశ్శాంతి కోసం హ్యారి రెండేళ్ళు ఇండియాకు వెళ్ళాడు అని అపద్ధం సృష్టించాడు. ఒక ఏడాది తరువాత హ్యారి ఇంటిని కూడా తన పేరుతో వ్రాయించుకొనేందుకు , ఒక లాయర్ను రమ్మని తాను హ్యారి ఇంటికెళ్ళి తాళంతీసి లాయర్ కోసం కాచుకొనివున్నాడు. ఇంతలో లాయర్ ఫోన్ చేసి అనుకోకుండా వచ్చిన ఇబ్బంది వల్ల తాను రాలేకపోతున్నానని చెప్పాడు. ఆకస్మాత్తుగా ఆప్రాంతంలో భూకంపం వచ్చింది. హ్యారీ ఇంట్లో గదిలో ఒక్కడేవున్న జార్జి భయపడ్డాడు. మరునిమిషమే మరోసారి భూమి పెద్దగా కంపించి భారీగా వున్న గది తలుపు జార్జి తలమీద పడింది. చాలా పెద్ద గాయం అయ్యింది. ఆ సమయంలో ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు , రాలేరు కూడా ఎందుకంటే అది భూమి కంపిస్తున్న సమయం - ఎవరి ప్రాణాలు వారికి తీపి. జార్జి అక్కడే చనిపోయాడు. ఆసక్తికరం ఏమంటే ఏ తలుపు వెనుక వున్న హాకి బ్యాట్ తో జార్జి , ఆనాడు హ్యారి ని తలపై కొట్టి చంపాడో , ఇపుడు అదే తలుపు జార్జి తలపైనే పడి అతన్ని చంపింది. కర్మ కు ఙ్ఞాపకశక్తి చాలా ఎక్కువ.
ఏ విషయంలోనైనా , ఎవరి విషయంలోనైనా [ తల్లితండ్రులు , స్నేహితులు , బంధువులు , కొత్తవాళ్ళు ... ] నమ్మకద్రోహం చాలా పెద్ద పాపం. పరిష్కారం లేని పాపం. మన మేలుకోరే మంచి వ్యక్తి / వ్యక్తుల హృదయాన్ని గాయ పరిస్తే అది తీవ్రమైన పాపం ఎందుకంటే మన హృదయంలో [ గుండే వున్న చోటు] మన చేతి బొటనవేలి సైజు లో ఆత్మ వుంటుంది. అక్కడే దైవం వుంటాడు. అటువంటి చోటైన హృదయాన్ని గాయపరచడమంటే , దైవాన్ని గాయపరచడమే. [ ' అంగుష్టమాత్ర: పురుషోమధ్య ఆత్మని తిష్టతి ' ] అపద్ధాలు చెప్పడం , నమ్మించి మోసం చేయడం , కఠినంగా మాట్లాడటం , ఇతరులు చేసిన మేలును మరవడం ,తేలిగ్గా తీసుకోవడం ... ఇవన్నీ మనం చేస్తున్న పాపాలు.
*అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ చదివినా, విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం*
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం
పంచశత శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.
మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.
పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!
క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.
తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.
ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు.
"వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క" అని పాండ్యరాజు వేడుకున్నాడు.
ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు. పాండ్యరాజు హతాశుడైయ్యాడు.
దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు.
రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.
ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.
పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.
ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.
ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !
అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి?
ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు.
ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!" ఆనుకుంది అమ్మవారు.
"ఎవరు నాయనా నీవు ? నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.
ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది.
"కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి" మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు".
" నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు.
"బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"
"కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.
పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు"
"మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను".
"అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.
ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు , పురాణ కథల కోసం
సనాతన హిందూ ధర్మం పేజీని #లైక్ చేసి #ఫాలో చేయండి.
"తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"
"తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.
జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి, తన సంహారకార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది.
ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.
"ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి. చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీఇష్టము!" అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు.
ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.
నీ లలితాసహస్రనామంలోని కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.
సంఖ్యాశాస్త్రప్రకారము పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది.
ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా
కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి.
"విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.
పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది.
"గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.
ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది.
పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు.
వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది.
అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.
"ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు.
"తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు.
"నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.
"నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.
*"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!"* అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు.
దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు.
అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడుతల్లీ!"
44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి.
"ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు.
"స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు.
భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.
మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత.
పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.
అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు.
కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు. బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు.
అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని
భయబ్రాంతుడయ్యాడు.
రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు.
సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది.
ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి".
"నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.
*బహుశా , భక్తాగ్రేసరులందరికీ తెలిసిందే అయి ఉంటుంది! అయినా మళ్ళీ చదువుతారు అని*....
కాశీలో జరిగిన యదార్థ గాథ. ఇది వాస్తవంగా జరిగనది...అంతే కానీ కధ కాదు...
ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద *భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ* అని అడిగాడు.
ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు.
*పండితుడికి కోపం వచ్చింది* నేనిక్కడే ఉండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా. వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ *మూడు జన్మల ముష్టివాడు* వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె, భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉండి తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు. ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.
*శ్లోకం* :
*అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః*
*దరిద్ర దానాచ్చ కరోతి పాపం*।
*పాప ప్రభావాత్ పునర్దరిద్రః*
*పునర్దరిద్రః పునరేవ పాపీ*॥
అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మళ్లీ చెప్పొద్దన్నాడు బిచ్చగాడు.
ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.
*జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు* ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో *జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి* కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక. అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు.
*తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం*. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. తిరగడం కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు. ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళ్ళిపోకూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం *అంటే అర్థాకలి* తన *ఆకలి కడుపుని* భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద *కాశీ పట్టణాన్ని చేరాడు*. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు. అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. *అతనొక సాధకుడని*కారణ జన్ముడనీ* అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును *కరపాత్ర స్వామీజీ* అని ప్రజలే ఆపేరు పెట్టారు . కరమే పాత్రగా కలిగినటువంటి వాడు అని పేరుపెట్టారు. ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతని కీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యయాహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ *కరపాత్ర స్వామీజీ* ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.
మన *కరపాత్ర స్వామీజీకి* అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ 1) *కరపాత్ర స్వామిజీ* ఎవరు. *ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను* ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) *నాకు గురువు ఎవరు* ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. *తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు* అని నిర్ణయించుకున్నాడు.
అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోనూ గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాాడు. ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో *కరపాత్ర స్వామిజీ* వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. *పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు* ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు *భిక్షా సమయం* అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. *పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి* అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరూ లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన *ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.* ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెలో ఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.
అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే *పండితుడు* *స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు*. స్వామిజీ ఇచ్చేశాడు.
ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు *నన్ను గుర్తు పట్టారా* అని. అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.
సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ *శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు*. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. *నాగురుదేవులు మీరు*. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు.
అయ్యా ముందు వినండి. *నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి* అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి *పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది*. అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు *నిష్కర్షగా* చెప్పాలి. ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ *ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా* చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే *నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ*. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను *మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది* నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక
ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.
*బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లో*ఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.
ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక *చెక్క దుంగని విగ్రహంలా చేసి* పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది..
ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు. వెంటనే *"ఒరేయ్ నన్ను కొట్టకు అంది,"* అందులో ఉన్న అమ్మ.. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..
అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు *వంద బంగారు నాణేలు* ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిన కనికరించిందా! అని,పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.
అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వుఅనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా, అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..
బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి.బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయారు.. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.
మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు.
దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది.
అది ద్వాపరయుగం. ఓసారి కృష్ణార్జునులకు ఓ పేద బ్రాహ్మణుడు కనిపించాడు. జాలిపడిన అర్జునుడు అతనికి ఓ సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ బ్రాహ్మణుణ్ని మార్గమధ్యంలో ఓ దొంగ దోచుకున్నాడు. గతిలేక అతడు మళ్లీ వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
ఓరోజు అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ వజ్రం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. గదిలో మూలన ఉన్న కుండలో దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది. చూస్తే భార్య లేదు. ఆ కుండా లేదు. పరుగెత్తుకుంటూ నదీతీరం దగ్గరికి వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కానీ కుండలో వజ్రం లేదు. నదిలో నీళ్లకోసం కుండ వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతణ్ని విచారించారు ఏమైందని. ‘‘ఇక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు’’ అన్నాడు అర్జునుడు.
‘‘లేదు అర్జునా. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ బ్రాహ్మణుడికి రెండు బంగారు నాణేలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు.
‘సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా...’ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఓ జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.
‘ఈ రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం’ అనుకుని నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ చేపను ఓ నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసింది. ‘‘అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండీ’’ అంటూ భర్తని పిలిచింది. గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. అది నదిలో వాళ్లు జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ‘‘దొరికింది... దొరికింది నా చేతికి చిక్కింది’’ అని గావుకేకలు పెట్టాడు ఆ బ్రాహ్మణుడు.
అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన దొంగ కంగారుపడ్డాడు. ‘గతంలో ఈ బ్రాహ్మణుడి నుంచే బంగారు నాణేల సంచి దొంగిలించా, ఇప్పుడు అతను నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. అందుకే నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు’ అనుకుని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ‘‘నీ బంగారు నాణేలు నువ్వే తీసేసుకో. నన్ను మాత్రం రక్షకభటులకు పట్టివ్వద్దు’’ అని ప్రాధేయపడ్డాడు.
దంపతులు నివ్వెరపోయారు. పోగొట్టుకున్న రెండూ తిరిగి వచ్చాయి. పరుగు పరుగున కృష్ణార్జునుల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
‘‘కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నువ్విచ్చిన రెండు నాణేలూ అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది’’ అని ప్రశ్నించాడు అర్జునుడు.
‘‘అర్జునా, తన దగ్గర బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడ్డలు, ఈతిబాధలు, కష్టసుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు.
అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను’’ అని ముక్తాయించాడు శ్రీకృష్ణ పరమాత్మ.🙏🙏
పార్వతీపరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి మురుగన్, స్కంధ, కుమార, సదానన, షణ్ముఖ, శరవన మరియు గుహనామములతో కొలువబడుచు దేశవిధేశములండు అనేకఆలయములు ఉన్ననూ అందు ముప్పది ప్రముఖక్షేత్రములున్నవి. ఈక్షేత్రములందు పదిమురుగన్ ఆలయములు పళని మురుగన్ ఆలయం, కుంభకోణం స్వామిమాలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, త్రిపురకూర్ణం మురుగన్ ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయం,మధురై పజముదిర్ చొలై మురుగన్ ఆలయం, మలేషియా దేశమునందు కల్లుమాలై ఆలయం, మలేషియా దేశమునందే పెనాంగ్ నందు దండయుధపాణి ఆలయం,శ్రీలంకనందు తొందైమన్నారులోకల సెల్వసన్నిధి మురుగన్ ఆలయం మరియు ఆస్త్రేలియాదేశములో సిడ్నీ పట్టణమునందుకల మురుగన్ ఆలయములు ప్రముఖమైనవి. రామేశ్వరం యాత్రనందు తమిళనాడు రాష్ట్రములో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు 1. తిరుపరన్ కుండ్రం, 2.తిరుచెందూర్, 3.పళని, 4.స్వామీమాలై, 5.ఆరుల్మిగు సోలైమలాల్. 6. తిరుత్తణి. దర్శించు అవకాశము లభించుటవిశేషము. దక్షంభారత దేశమునందు తమిళనాదునందలి సుబ్రహ్మణ్య లేదా మురుగన్ ఆలయములతోపాటుగా దక్షణ భారతదేశమునందే కర్నాటకనందు దక్షిణ కన్నడజిల్లాలోని సుబ్రమణ్య అను గ్రామములో సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయము విశిష్టత కలిగిఉన్నది. కార్తికేయుడిని ఇచ్చట సర్పదేవత సుబ్రమణ్యునిగా ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్యసర్పమైన వాసుకి మరియు ఇతరసర్పాలు సుబ్రమణ్యుస్వామి శరణుపొందాయని పురాణములందు తెలుపబడినది.
మంగళూరు నుండి రైలు, బస్సు, ప్రయివేటు వాహనములద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈక్షేత్రమునుగతములో కుక్కే పట్టణమని పిలిచేడివారు. ఆదిశంకరాచార్యూలవారు కొన్నిరోజులు ఇక్కడగడిపినట్టు "శంకర విజయం" నందు తెలుపబడింది. శంకరాచార్యులవారి "సుబ్రమణ్య భుజంగప్రయత స్తోత్రం"లో ఈక్షేత్రాన్ని"భజే కుక్కేలింగం"గా ప్రస్తావించారు. స్కంధపురాణము సనాతకుమారసంహితనందు శ్రీసుబ్రమణ్యక్షేత్రంగురించి అద్భుతంగాఅభివర్ణించారు. కుమార పర్వతశ్రేణినుండి ఉద్బవించిన ధారానదిఒడ్డున ఈదివ్యక్షేత్రంఉన్నది. శ్రీక్షేత్రాన్నిదర్శించే యాత్రికులు కుమారధారనదినిదాటి ఆలయాన్ని చేరుకోవాలి. సుబ్రమణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధారనదిలో స్నానంచేయుదురు
శ్రీ కుక్కేసుబ్రమణ్యస్వామి దివ్యక్షేత్రం కర్నాటక రాష్ట్రములోని సుందరమయిన భారతదేశమునకు పశ్చిమకనుమలలో మంగళూరు నుండి 105కి.మీ.దూరంలో దట్టమయిన పచ్చని అడవులతో సుప్రసిద్దమైన కుమారపర్వతం అనబడు పర్వతమునకు ముందుభాగమునఉంది. పర్వతారోహకులకు ఈపర్వతం ఎంతో ఇష్టమైనప్రదేశం. కుమారపర్వతం పడగవిప్పి పహారాకాస్తున్న ఆరుసర్పముల కాలనాగు (శేష పర్వతం) వలె అందంగాఉంటుంది. రమణీయప్రదేశంనడుమఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కేసుబ్రమణ్య ఆలయం కొలువైఉంది. భారతదేశంలో ఇంతటి అందమైనప్రదేశాలు అరుదుగా ఉన్నాయి. దక్షిణ కర్ణాటకనందు దాదాపుగా ఇటువంటి అందమైన వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ అందమైన జలపాతాలు, అడవులు, కొండలతోఉన్న గ్రామముమధ్య ఆలయము. ఉండటము ఒకఅద్భుతము.
ఆలయము వెనుకనుండి భక్తులు గుడిప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ నకు ప్రదిక్షిణలు చేస్తారు. మూలవిరాట్ ముఖద్వారానికి మధ్య గరుడస్తంభం వెండితాపడం చెయ్యబడిఉంటుంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, ఆలయంలోపల నివాసమున్న వాసుకిఊపిరినుండి వెలువడు విషగాలులనుండి భక్తులను కాపాడటానికి ప్రతిష్ఠించబడిందనినమ్మెదరు స్తంభంమునకు సుబ్రమణ్య ఆలయమునకు మధ్య బాహ్యామందిరం, అంతరమందిరం కలవు.. గుడికి మధ్యలో పీఠంఉంది. పీఠంపైభాగంలో సుబ్రమణ్యస్వామి, వాసుకిలవిగ్రహాలు, కిందభాగంలో శేషనాగువిగ్రహం ఉన్నాయి. ఈవిగ్రహాలకు నిత్యకర్మ ఆరాధన పూజలుజరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యతవలన ఈఆలయము దినదిన ప్రవర్ధమానంచెందుతూ చాలావేగంగా అభివృద్ధి, ప్రజధరణ పొందుతున్నది పురాణకధల ప్రకారము షణ్ముఖప్రభువు తారక, శూరపద్మసురఅను రాక్షసులనువారి అనుచరుల సమేతంగా సంహరించి తనసోదరుడు గణేషుణితో కలిసి కుమారపర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడఇంద్రుడు గొప్పఆహ్వానం పలుకుతాడు. రాక్షససంహారంవల్ల చాలాసంతోషంతోఉన్న ఇంద్రుడు, కుమారస్వామిని తనకుమార్తె దేవసేనను వివాహముచేసుకొమ్మని అడిగాడు. అందుకు కుమారస్వామి అంగీకరించగా, వారివివాహం కుమారపర్వతం పైన మార్గశీర్షమాసం శుద్ధశష్టినాడు జరిగింధి.. ఆవివాహంతోజరిగిన షణ్ముఖ పట్టాభిశేఖానికి దేవదేవులు బ్రహ్మ,విష్ణు, శివుడుమొదలైన దేవతలుహాజరై ఆశీర్వదించారు. కార్యక్రమానికి ప్రసిద్థ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకన్ని నిర్వహించారు. అలా పుణ్యనదుల కలియకనుంచి ప్రవహించినధార కుమారధారగా పిలవబడుచున్నది. గరుడునిధాడినుంచి తప్పించుకోవటానికి సర్పరాజు వాసుకి కుక్కేసుబ్రమణ్యక్షేత్రములో శివునిగురించి తపస్సు చేశాడు..వాసుకి తపస్సుకుమెచ్చిన శివుడు, షణ్ముఖుడిని తనభక్తుడు వాసుకికిఅండగా, తోడుగా ఉండమని తెలిపాడు.. అందుకే ఇచ్చట వాసుకిఅనబడు నాగరాజుకుకానీ చేయు పూజలు సుబ్రమణ్యస్వామికి చేసినట్లీ. శ్రీక్షేత్రం కుక్కేసుబ్రమణ్యఆలయంలో ఆశ్లేషబలిపూజ అను కాలసర్పదోషపూజ నిర్వహిస్తారు. సుబ్రమణ్యస్వామి కాలసర్పదోషము, కుజదోషములనుండి భక్తులకు రక్షణఇస్తాడు. ఆశ్లేషబలిపూజ ప్రతినెల ఆశ్లేషనక్షత్ర దినాలలో జరపబడుతుంది. పూజకుహాజరయ్యే భక్తులు సమయానుసారం దేవస్థానంలోపల సంకల్పంచేసే పురోహీతుడి ముందు హాజరుకావలెను. హోమపూర్ణహుతి పిమ్మట భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. శ్రావణ, కార్తీక, మృగశిర మాసముయందు భక్తులు ఈపూజ విశిష్టముగా చేస్తారు. సర్పదోషమునుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈపూజచేస్తారు. ఈజన్మలోకానీ లేక గతజన్మలోకానీ, తెలిసికానీ, తెలియకకానీ పలుకర్మల వలన సర్పదోష బాధితులయినవారికీ పండితులు ఈసర్పదోషనివారణ పూజను విముక్తిమార్గంగా సూచిస్తారు. ఈ పుజను వ్యక్తికానీ, కుటుంబంతోకానీ, లేక పూజారి ఆద్వర్యంలో కానీ చేయవచ్చును. ఈపూజావిధానం ఒకవ్యక్తి మరణానంతరం జరిగే శ్రార్ధఖర్మలపూజవలె ఉంటుంది. సర్పసంస్కార పూజ చెయ్యదలిచినవారు రెండురోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈపూజ సూర్యోదయసమయంలో చెయ్యబడుతుంది. ఆరోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. పూజప్రారంభం నుంచి ముగింపువరకు దేవస్థానంవారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమేభుజించాలి. నలుగురుకి దేవస్థానంవారు భోజన మేర్పాటు చేస్తారు. ఆలయము ఉదయం 7-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 3-30 నుండి 8-30 వరకు తెరచియుండును. బసకు దేవస్థానమువారి వసతిగృహములు మధ్యతరహానుండి ఉన్నతశ్రేణివరకు లభ్యమగును.
వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం.
ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని
వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.
కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి......
వైష్ణోదేవి వెళ్ళి వచ్చినవారు వుంటారుగానీ,
ఆ కధను పూర్తిగా తెలుసుకున్నవారు తక్కువమందే వుండవచ్చు.
అందుకే ముందుగా వైష్ణోదేవి గురించి...
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా,
తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి.
ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే
దేవి మహిమకి నిదర్శనం.
ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన
కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని
భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి,
భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి.
ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు.
ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు
ప్రారంభం అయినాయనీ,
వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని
ఇంకొక కధనం.
ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి
ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు.
నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి ....
ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.
ఆ కధ ఏమిటంటే...
పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు.
వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది.
వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని,
ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత
శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు.
ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయబడ్డది.
వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది.
తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.
అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో వున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు.
వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని,
తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు.
ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు.
కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది.
అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.
బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి,
ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని
ధైర్యం చెప్పాడు.
త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి,
వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె
ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో
లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.
భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు.
తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు,
ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.
వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ,
గోరఖ్ నాధ్ నీ, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు.
వైష్ణవి మందలించినా వినడు.
వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని
వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది.
తన తపస్సును కొనసాగించటానికి.
భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని
ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది.
తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత
శిఖరం మీద పడింది.
అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు
వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు.
మాత దయతలచి,
తన భక్తులంతా తన దర్శనం తర్వాత
భైరవుణ్ణి దర్శిస్తారని,
అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.
తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి,
అలాగే తనని సృష్టించిన త్రిమాతలు,
మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో,
3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది.
వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు
రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు)
ఆ మాత తలలే.
వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.
వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి.
దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి.
24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి.
ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు.
కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా,
డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు.
కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. అదే డోలీ.
తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ
లయ బధ్ధంగా చేసే నినాదాలు యాత్రీకులలో
ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆగేవాలే బోలో జైమాతాకీ పీఛేవాలే బోలో జైమాతాకీ
పాల్కీవాలే బోలో జైమాతాకీ ఘోడేవాలే బోలో జైమాతాకీ
అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.
అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి. నిర్భయంగా కొండ ఎక్కవచ్చు.
అయితే రాత్రిళ్ళు డోలీలుండవు.
ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది
(రాత్రంతా కూడా).
దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో
పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట.
ప్రస్తుతం మార్గం సుగమంచేశారు.
ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.
ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి.
దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి.
పరఛీ అంటారు దీనిని.
ఎక్కువ సమయం పట్టదు దీనికి.
గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు.
ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారం
గుండా లోపలకి వెళ్ళాలి.
లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది.
అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి
(కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు.
మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి.
దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు.
ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి.
జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు. ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు. దానితో తొక్కిడి వుండదు
5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది.
డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా కొంచెం దూరంగా ఆగుతాయి. అక్కడనుండి నడక తప్పదు.
అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు.
అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు.
కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.
ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది. ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది.
ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి. మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.
ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను.
డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో
రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో
చెప్పి బుక్ చేసుకోండి.
ఇవ్వాల్సిన డబ్బు (డోలీ ఎక్కేవారి బరువునిబట్టి వుంటుంది), డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు.
ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్.
అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు.
విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి.
మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని
మీ దగ్గర పెట్టుకోండి.
ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు.
మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.
డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..
అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు..
ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి.
మాకు తెలియక అవి చూడలేదు.
మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని
పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).
దోవ ఒకటే వుంటుంది. ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి. మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి. సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు). అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు. గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు.
మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి. అమ్మవార్లు ముగ్గురుంటారు..
కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...
మధ్యలో దేవి వైష్ణవి.
ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు. అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి.
అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు.
దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి..
పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే.
భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు. పైన వుండటానికి కూడా వసతి వున్నది.
మార్గం:
జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు,
వాయు మార్గాలున్నాయి.
అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు.
దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని, అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని