Pages

వీధిచివర




కృష్ణా.... కృష్ణా.. ఓసారి ఇలా రా.. అంటూ తన ఏడేళ్ల కృష్ణను వాళ్ల అమ్మ పిలవగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ... చెప్పమ్మా ఏంటి అన్నాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ఆ వీధిచివర కూర్చుని వుంటుంది కదా ఆ అవ్వకు ఇచ్చిరా అనిచెప్పి చిన్న క్యారియర్ బాక్స్ కృష్ణచేతికిచ్చింది.
అమ్మా ఎందుకమ్మా ఆ అవ్వకు రోజూ ఇలా అన్నం పెట్టి పంపుతుంటావు. ఆమె మన చుట్టాలా అని అడిగాడు కృష్ణ.
కాదునాన్నా.. ఆమె ఎవరో ఏమిటో తెలియదు. ఆమెకేంజరిగిందో తెలియదు. కొన్ని రోజుల నుండి అక్కడే కూర్చుని వుంటోంది. పాపమనిపంచి ఇలా చేస్తున్నాను అంది. అలా చేస్తే మనకేమొస్తుందమ్మా అని అడిగాడు కృష్ణ. మనకేదో ఉపయోగం వుంటుంది లేదా మనకు ఏదో మంచి జరుగుతుందని చేసేది సాయంకాదు నాన్నా అని చెప్పింది. అసలు సాయం అంటే ఏంటి ఎందుకు మనం చేయాలి అని కృష్ణ అడిగిన ప్రశ్నకు వీడికి ఎలా చెప్తే అర్థమౌతుందని ఆలోచించి ఇలా చెప్పసాగింది.
సాయం అంటే సాటి వారికి అండగా నిలవడం. అంటే ఎదుటి వారు కష్టాల్లో వున్నప్పుడు వారినుండి మనము ఏమీ ఆశించకుండా వారి కష్టాలను తీర్చడంలో మనము వారికి తోడుగా వుండడం. మరి అలా చేస్తే ఏంజరుగుతుందని అడిగాడు కృష్ణ. మన మనసులో చాలా ఆనందం నిలుస్తుంది. ఎవరైతై ఇలా ఏమీ ఆశించకుండా సాయం చేస్తారో వారు దేవుళ్ళతో సమానమౌతారు. ఇంకేంకావాలిరా అంతకన్నా అని చెప్పింది. అసలు దేవుడంటే ఏంటమ్మా. రోజూ ఫోటోలో చూపించి దండంకూడా పెట్టమంటావ్ కదా నువ్వు అని అన్నాడు. దేవుడంటే కనిపించే రూపంకాదునాన్నా. మన అందరిలోనూ దేవుడుంటాడు. మంచి చేయమనే మన మనసుకు చెబుతూ వుంటాడు.కానీ మనమే మన స్వార్థంకోసం మనకు నచ్చినట్టు చేస్తుంటాము. అంతెందుకు నీగురించే తీసుకో... ఈఅన్నం ఆ అవ్వకు పెట్టమని నీకు చెబితే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావ్. ఇలా చేయడంవల్ల నీకేమి వస్తుంది అనుకుంటున్నావ్. ఒక పని చెయ్యి ఇప్పుడు ఈఅన్నం ఆమెకిచ్చి ఆమె కళ్ళలోకి చూసి నేను ఇప్పుడు చెప్పేమాటే చెప్పు. అవ్వా బాగున్నావా. ఇదిగో అన్నం నీకోసమే అని ఇచ్చి చూడు అంది. సరే అమ్మా అలాగే చెప్పి వస్తానని చెప్పి అన్నంతీసుకొని వెళ్ళాడు కృష్ణ...
కాసేపటికి ఇంటికి వచ్చి అమ్మను గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు...
ఆమెకు అర్థంఅయ్యింది. ఊరుకో కృష్ణా ఊరుకో.. అని చెప్పి తన కళ్ళు తుడుస్తూ అడిగింది. ఏమందిరా ఆ అవ్వ అని...
నువ్వడగమన్నట్టే అడిగానమ్మా. అప్పడు ఆమె నా చెయ్యి పట్టుకొని తనకళ్ళకు అద్దుకొని మానాయనవిరా నువ్వు. నాదేవుడివి నువ్వు. నువ్వెప్పుడూ సంతోషంగా వుంటావు. ఆయుష్మాన్ భవ. నాఆయుష్షు కూడా నీకే పోసి నిన్ను ఆదేవుడు చల్లంగా చూడాలని ఏడుస్తూ చెప్పిందమ్మా అన్నాడు. ఆమె ఎంతో ఆకలితో ఉన్నట్టుందమ్మా పాపం అని ఏడ్చేశాడు కృష్ణ.
అప్పడు వాళ్ళమ్మ, ఇప్పడు చెప్పు నీకేమనిపిస్తోంది. సాయం అనేది నీకు నచ్చినప్పుడు చేయటం కాదురా, అది నీఅలవాటుగా మార్చుకో. అప్పుడు జీవితమంతా సంతోషంగా వుంటావు అని చెప్పింది. అప్పడు కృష్ణ.. నిజమే అమ్మా. పెద్దయ్యాక నా డబ్బుతో నేనే వెళ్లి ఇలాంటి వారికి సాయంచేస్తాను అని చెప్పి అమ్మ బుగ్గకు ప్రేమతో ఒక ముద్దిచ్చాడు.

-మనం మన పిల్లలకు మాటలతో చెప్పటంకన్నా వారితో మంచి పనులు చేయించడం అలవాటు చేస్తే నూటికి 99 మందైనా ఖచ్చితంగా మంచివారుగా తయారౌతారు అనే వుద్దేశంతో రాశాను.
-అందుకే అన్నారు మన పెద్దలు "మొక్కై ఒంగనిది మానై ఒంగునా అని
తెలుగులో విజ్ఞానం
written by : Kasulanati Vamsikrishna

No comments:

Post a Comment